కేసీఆర్‌ సంచలన నిర్ణయం...దేనికి దారి తీస్తుందో?

September 04, 2019


img

గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతలను పెంచడానికిగాను రూపొందించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు గురించి అధికారులకు వివరించేందుకు సిఎం కేసీఆర్‌ మంగళవారం రాజేంద్రనగర్‌లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దానిలో ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు ప్రకటించారు. 

1. ప్రభుత్వోగుల పదవీ విరమణ వయసును 60 లేదా 61 ఏళ్ళకు పెంచబోతున్నట్లు ప్రకటించారు.

2. ప్రభుత్వోద్యోగుల పదోన్నతుల షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు.

3. గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న అటెండర్లు, స్వీపర్లు, ఇతరపని వాళ్ళలో వయోభారం, అనారోగ్య కారణాల చేత పనిచేయలేకపోతున్నట్లయితే, వారి వారసులకు ఆ పనులు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. 

4. మండల జిల్లా పరిషత్ సమావేశాలలో ఏవైనా అంశాలపై చర్చిస్తునప్పుడు ప్రజాప్రతినిధులెవరైనా స్థానిక అధికారులను, ఉద్యోగులను దూషిస్తే వారిపై కటినచర్యలు తీసుకొంటామని తెలిపారు.

5. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని ఆదేశించారు.

6. ఇక నుంచి కలెక్టర్ల సర్వీస్ రికార్డులను తానే స్వయంగా వ్రాస్తానని సిఎం కేసీఆర్‌ తెలిపారు. వారిలో అత్యుత్తమ పనితనం కనబరిచిన వారికి ‘గ్రీన్ కలెక్టర్’ అవార్డులు ఇస్తామని ప్రకటించారు.   

ఇప్పటికే ఉద్యోగాల కల్పనలో ఆలస్యం  జరుగుతున్నందుకు రాష్ట్రంలో నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెరాస అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 10 లక్షల మందికిపైగా ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ దానిని ఇంతవరకు అమలుచేయకపోవడంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. నిరుద్యోగ భృతి హామీ కోసం ‘రాష్ట్రంలో10 లక్షల మందికిపైగా ఉన్న నిరుద్యోగులు ఉన్నారని’ సిఎం కేసీఆర్‌ స్వయంగా దృవీకరించి, మళ్ళీ ఇప్పుడు వారికి ఉద్యోయగలు కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టకుండా, ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును పెంచితే నిరుద్యోగులు...వారితోపాటు ప్రతిపక్షాలు కూడా ఆందోళనబాట పట్టడం ఖాయం. 

గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న అటెండర్లు, స్వీపర్లు, ఇతరపని వాళ్ళకు వారసత్వ ఉద్యోగాల కల్పనపై కూడా అభ్యంతరాలు, కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు అధికారులను దూషించడం పరిపాటిగా మారిందనేది బహిరంగ రహస్యమే. కానీ అధికారపార్టీకి చెందిన సభ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే సాహసం చేయగలదా? చూడాలి. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వోద్యోగులను మంచి చేసుకోవడం కోసమే సిఎం కేసీఆర్‌ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.


Related Post