ఏపీ, తెలంగాణ ఆర్టీసీలలో డిఫరెంట్ స్టోరీలు

September 03, 2019


img

ఏపీ, తెలంగాణ ఆర్టీసీలలో ఒకే సమయంలో ఈరోజు పూర్తిభిన్నమైన పరిణామాలు జరగడం విశేషం. ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగీకారం తెలిపారు. ఈరోజే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయి. 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోవిలీనం చేస్తానని పాదయాత్ర సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సానుకూలంగా నివేదిక ఇవ్వడంతో సిఎం జగన్‌ మంగళవారం దీనిపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ఆ శాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిఎం జగన్ అంగీకరించారని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. దీనికోసం ప్రభుత్వంలో ప్రజారవాణా అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబందించి విధివిధానాలను రూపొందించి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తికాగానే ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వోద్యోగులవుతారని, వారికి కూడా ఇకపై ఇతర ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులకు లభించే జీతభత్యాలు, సౌకర్యాలు వర్తింపజేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. దీని కోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక తెలంగాణ ఆర్టీసీలో దీనికి పూర్తి భిన్నమైన పరిణామం ఈరోజే జరగడం యాదృచ్చికమే. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన కార్యదర్శి  రాజిరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు బస్ భవన్‌కు వెళ్ళి ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందజేశారు. 2017 వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, మరికొన్ని పెండింగ్ సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం వలననే సమ్మెకు సిద్దం కావలసివస్తోందని రాజిరెడ్డి చెప్పారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలని రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.


Related Post