సంగారెడ్డిలో స్టంట్స్ తయారీ పరిశ్రమకు భూమిపూజ

September 03, 2019


img

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటవుతున్న మెడికల్ డివైసస్ పార్క్ (వైద్యపరికరాల పారిశ్రామికవాడ)లో గుండెలో ఉపయోగించే స్టంట్స్ తయారీ పరిశ్రమకు సోమవారం శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. గుజరాత్‌కు చెందిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ సంస్థ దీనిని నెలకొల్పబోతోంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లు పెట్టుబడితో నిర్మించబోయే ఈ పరిశ్రమలో ఏడాదికి 1.25 మిలియన్ స్టంట్స్ తయారవుతాయి. దీనిలో ప్రత్యక్షంగా 2,200 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 500 మందికి ఉపాది లభించనుంది. 

    

సహజానంద్ గ్రూప్ చైర్మన్ ధీరజ్‌లాల్ కొటాడియా, మంత్రులు ఈటల రాజేందర్‌, సిహెచ్ మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇది ఆసియాలోకెల్ల అతిపెద్ద స్టంట్స్ తయారీ సంస్థ అని సహజానంద్ గ్రూప్ చైర్మన్ ధీరజ్‌లాల్ కొటాడియా తెలిపారు. రాగల ఆరేళ్ళలో ప్రపంచంలో నెంబర్: 1 స్థానానికి చేరుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  ఏడాదిన్నరలోపుగా సుల్తాన్‌పూర్‌లో ఉత్పత్తి ప్రారంభించే విధంగా నిర్మాణపనులు పూర్తిచేస్తామని అన్నారు.  

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం, రాష్ట్రాభివృద్ధికి సిఎం కేసీఆర్‌ కనబరుస్తున్న నిబద్దత కారణంగా దేశవిదేశాలకు చెందిన అనేక సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నేటికీ సామాన్య ప్రజలకు ఈ స్టంట్స్ అందుబాటులో లేవని, కనుక వారికి అందుబాటుధరల్లో స్టంట్స్ తయారు చేసేందుకు పరిశోధనలు చేపట్టవలసిందిగా ఈటల రాజేందర్‌ ధీరజ్‌లాల్ కొటాడియాను కోరారు.



Related Post