గులాబీ జెండాకు కేసీఆరే బాస్: ఎర్రబెల్లి

August 31, 2019


img

శనివారం తెలంగాణ భవన్‌ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బయటకు వస్తుండగా విలేఖరులు ఎదురవడంతో వారితో ఆయన కాసేపు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై స్పందించవలసిందిగా కోరగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, “గులాబీ జెండాకు కేసీఆరే బాస్. వేరెవరూ కాదు. ఆయనే స్వయంగా ఆ జెండాను రూపొందించారు. కనుక దీనిపై మరెవరికీ హక్కు లేదు. ఈటల రాజేందర్‌ అంశం సమసిపోయింది. ఆయనకు డోకా లేదు. నేను కూడా తెలంగాణ ఉద్యమాలలో పని చేశాను. ఆ సమయంలో టిడిపిలో ఉన్న నేను చంద్రబాబునాయుడును ఒప్పించి రాష్ట్ర విభజనకు ఆయన చేత లేఖ ఇప్పించాను,” అని అన్నారు.

ఈటల రాజేందర్‌ వివాదం సమసిపోయిందటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన ఈ వివరణ పార్టీలో వివాదం మొదలైందని దృవీకరించినట్లుంది. “గులాబీజెండా కేసీఆర్‌దే” అని చెప్పడం ఇంకా అనుమానాలు పెంచుతోంది. పార్టీలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు లేదా వారి విధేయులకు మరో వర్గానికి మద్య ఆధిపత్యపోరు జరుగుతోందని సూచిస్తున్నట్లుంది.

మూడేళ్ళ క్రితం తెరాసలో చేరిన ఎర్రబెల్లి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఈటల రాజేందర్‌కు డోకా లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పార్టీలో కొత్తగా చేరిన ఇటువంటి నేతల కారణంగానే తనకు ప్రాధాన్యత తగ్గిందనే ఆవేదనతోనే ఈటల రాజేందర్‌ “ఉద్యమ సమయం నుంచి పార్టీ జెండా భుజాన్న మోసి స్వశక్తితో పైకి ఎదిగిన నేతను నేను...స్వశక్తితో ఎదగలేనివారే పదవుల కోసం పైరవీలు చేసుకొంటారు,” అని అని ఉండవచ్చు. ఈటల రాజేందర్‌ అంశం ముగిసిపోయిందని ఎర్రబెల్లి చెప్పినప్పటికీ ముగిసిపోయిందనుకోలేము.


Related Post