తెరాస ప్రయోజనాల కోసమే రాయలసీమకు నీళ్ళు: డికె.అరుణ

August 31, 2019


img

బిజెపి నేత డికె.అరుణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్వాసితులకు న్యాయం చేయలేకపోతున్న సిఎం కేసీఆర్‌, ఏపీలోని రాయలసీమ జిల్లాలకు నీళ్ళు పారించి ఆదుకొంటానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆనాడు నేను ఏపీ సిఎంకు హారతి పట్టానని విమర్శించిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాయలసీమకు నీళ్ళు పారిస్తానని ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారు. అయితే తెరాస రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చి ఉండవచ్చు,” అని అన్నారు. 

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలలో శాస్వితంగా నీటి సమస్యలను పరిష్కరించవచ్చని, తెలంగాణలో ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాలకు సాగుత్రాగునీటిని అందించవచ్చని సిఎం కేసీఆర్‌ అన్నారు. దీనిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఏపీలో చంద్రబాబునాయుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ముందుకే సాగుతామని సిఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ఇది చాలా భారీ ప్రాజెక్టు కనుక దీనిపై రెండు రాష్ట్రాల అధికారులు లోతుగా చర్చించుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత పకడ్బందీగా ఒప్పందాలు చేసుకొంటామని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

ఏపీలో ప్రభుత్వం మారగానే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి అతిభారీ ప్రాజెక్టులనే నిలిపివేసి పునః సమీక్షిస్తుండటం, దానిపై జరుగుతున్న గొడవలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం కోసం ఒప్పందాలు చేసుకొని ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టాక, ఒకవేళ 2023లో ఏపీ లేదా తెలంగాణలో ప్రభుత్వాలు మారి, అవి ఇదేవిధంగా పునః సమీక్ష చేస్తామంటే అప్పుడు ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమవుతుంది?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Related Post