రైతుబంధు పధకం కుదింపు?

August 31, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పధకాన్ని కుదించేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదన చేసినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఎన్ని వందల ఎకరాలు ఉన్నా అందరికీ ఈ పధకాన్ని వర్తింపజేస్తున్నందున ఆర్ధికసాయం అవసరంలేనివారికి కూడా భారీగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. దీనివలన ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరిగింది. నిజంగా ఆ డబ్బు అవసరం ఉన్న కౌలురైతులకు ఇవ్వడానికి కుంటిసాకులు చెపుతున్న ప్రభుత్వం, వందల ఎకరాల భూములున్న రాజకీయనాయకులకు, భూస్వాములకు అప్పనంగా డబ్బు ముట్టజెప్పుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

కనుక ఇక నుంచి ఎంత భూమి ఉన్నప్పటికీ గరిష్టంగా 10 ఎకరాలకు మాత్రమే రైతుబంధు పధకాన్ని వర్తింపజేయాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు చేసి సిఎం కార్యాలయానికి పంపించినట్లు తాజా సమాచారం. ఆర్ధికమాంద్యం ముంచుకు వస్తున్నందున ప్రభుత్వంలో అన్ని శాఖలు పొదుపు చర్యలు పాటించాలని సిఎం కేసీఆర్‌ చేసిన సూచన మేరకే వ్యవసాయశాఖ అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేస్తే వచ్చే రబీ లేదా ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అమలుచేయాలని భావిస్తున్నారు. దీనివలన రూ.2,000 కోట్లు మిగులుతాయని ఆర్ధికశాఖ లెక్కకటిన్నట్లు తెలుస్తోంది. 

గత ఏడాది రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8,000 చొప్పున 53 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ. 10,000 కోట్లు చెల్లించింది. ఈసారి ఎకరానికి రూ.10,000 చొప్పున చెల్లిస్తామని ఎన్నికల సమయంలో తెరాస హామీ ఇచ్చినందున, ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,000 కోట్లు కేటాయించింది. 

ఖరీఫ్ సీజనులో ఎకరానికి రూ.5,000 చొప్పున చెల్లిస్తోంది. అయితే వందల ఎకరాలున్న వారికి కూడా ఈ పధకాన్ని వర్తింపజేస్తున్నందున ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరగడంతో చెల్లింపులలో ఆలస్యం అవుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 40 లక్షల మందికి మాత్రమే రైతుబంధు సొమ్ము చెల్లించగలిగింది. మరో 14 లక్షల మందికి ఇంకా రూ. 2,000 కోట్లు వరకు చెల్లించవలసి ఉంది. కనుక రైతుబంధు పధకం కుదించడం మంచిదని ఆర్ధిక, వ్యవసాయశాఖల అధికారులు భావిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ సూచన మేరకే అధికారులు ఈ ప్రతిపాదన చేశారు కనుక దీనికి సిఎం కేసీఆర్‌ ఆమోదించే అవకాశం ఉందని భావించవచ్చు.           



Related Post