రాష్ట్రంలో రాజకీయ నేతలకు...ఉద్యోగులకు ఫైట్

August 30, 2019


img

రాష్ట్రంలో ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వోద్యోగులు జీతాల పెంపు లేదా తమ డిమాండ్స్ సాధన కోసమే ప్రభుత్వంతో ఘర్షణ పడుతుంటారు. కానీ ఇప్పుడు రాజకీయ నిర్ణయాలు, వ్యాఖ్యల కారణంగా వారు రోడ్లపైకి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

రెవెన్యూశాఖను రద్దు లేదా విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో వీఆర్వోలు ఆందోళనబాట పట్టారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న తమపై అవినీతి ముద్రవేసి తొలగించాలనుకోవడం సరికాదని వారు సిఎం కేసీఆర్‌కు హితవు పలికారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కానీ సిఎం కేసీఆర్‌ ఈవిషయంలో వెనకడుగువేసే ఉద్దేశ్యం లేనట్లే కనబడుతున్నందున రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనతో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడేవరకు సంయమనం పాటించాలని వారు నిర్ణయించుకున్నందున ప్రస్తుతం రెవెన్యూశాఖ నివురు కప్పిన నిప్పులా ఉంది. 

ఇక కాంగ్రెస్‌-తెరాసల మద్య జరుగుతున్న రాజకీయ పోరాటలలో భాగంగా మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ సిఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూ, ఆయనకు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు సహకరిస్తున్నారన్నట్లు విమర్శలు చేయడంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరసనలు తెలుపుతూ శుక్రవారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. రేవంత్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అయితే వారు తెరాస నేతల ప్రోత్సాహంతోనే ఆందోళనబాట పట్టి ఉండవచ్చని కాంగ్రెస్‌ నేతలు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వోద్యోగులకు, రాజకీయ నేతలకు మద్య ఇటువంటి కారణాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడటం చాలా ఆందోళనకరమే.


Related Post