ఈటల అలా ఎందుకు అన్నారో?

August 30, 2019


img

సాధారణంగా ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం హుజూరాబద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చాలా ఆవేశంగా మాట్లాడిన మాటలపై పార్టీలోపలా, బయటా అందరూ చర్చించుకొంటున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారంటూ పార్టీలోనే ఒక వర్గం పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తోందని గ్రహించి ఆవిధంగా అన్నారా? లేక సిఎం కేసీఆర్‌ తనను పదవిలో నుంచి తొలగించలేరనే ఉద్దేశ్యంతో అన్నారా?లేక కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కొనేందుకు సిఎం కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ ద్వారా ఏదైనా కొత్త వ్యూహం సిద్దం చేస్తోందా? అనే చర్చ మొదలైంది. 

ఈటల ఉద్వేగపూరితంగా మాట్లాడిన తరువాత తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ‘కేసీఆరే మా నాయకుడు,’ అని ఈటల రాజేందర్‌ ఒక సంక్షిప్త ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. అంటే ప్రభుత్వంలో, పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించడం, మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నందునే “ఉద్యమసమయం నుంచి పని చేస్తున్న మేమే గులాబీ జెండాకు యజమానులం ” అని అన్నారా? తద్వారా తెరాస అధిష్టానంకు హెచ్చరికలు పంపారా? అనే చర్చ జరుగుతోంది. 

శుక్రవారం ఉదయం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో ఈటల రాజేందర్‌ ప్రసంగంపై జరిగిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఒక సీనియర్ పాత్రికేయుడు దీనిని మరో కోణంలో నుంచి చూపారు. తెరాస కూడా తమిళనాడులోని డిఎంకె, అన్నాడిఎంకె పార్టీల తరహాలో బలపడాలని సిఎం కేసీఆర్‌ కొంతకాలం క్రితం అన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ, “రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలను శాస్వితంగా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే, తెరాసకు ప్రత్యామ్నాయం మరో తెరాసను సృష్టించాలని కేసీఆర్‌ ఆలోచనకావచ్చని, బీసీ నేతగా మంచి పేరు, గుర్తింపు కలిగిన ఈటల రాజేందర్‌ చేత వేరే పార్టీ పెట్టించి ఆ వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలుచేయించాలని ప్రయత్నిస్తున్నారేమో? తద్వారా తెలంగాణలో తెరాస లేదా దాని కనుసన్నలలో పనిచేసే తెరాస-బి పార్టీ మాత్రమే అధికారంలో ఉండేలా చేసుకొని, తమిళనాడులో మాదిరిగా కాంగ్రెస్‌, బిజెపిలకు చోటు లేకుండా చేయాలని సిఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారేమో?” అని అనుమానం వ్యక్తం చేశారు. “లేకుంటే ఈటల రాజేందర్‌ వంటి పార్టీ విధేయుడు కేసీఆర్‌ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నట్లు మాట్లాడే అవకాశమేలేదని” అన్నారు. 

“కేసీఆరే మా నాయకుడు,” అంటూ ఈటల రాజేందర్‌ గురువారం రాత్రి సంక్షిప్త ప్రకటన చేయడం నిజమే అయితే, కేసీఆర్‌ సరికొత్త వ్యూహంలో భాగంగానే ఈటల రాజేందర్‌ ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఈటల రాజేందర్‌ నిన్న మాట్లాడిన మాటలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టించాయని చెప్పక తప్పదు. 


Related Post