విమోచన దినోత్సవం ఎందుకు జరుపడం లేదో?

August 29, 2019


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సిఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. "సిఎం కేసీఆర్‌ ఒక నిజాం నవాబులా వ్యవహరిస్తున్నారు. ఆనాడు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు జరుపడం లేదంటే, మజ్లీస్ మెప్పుకోసం, తద్వారా ముస్లింల ఓట్ల కోసమే. కనుక సెప్టెంబర్ 17న బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతోంది. ఈసారి కేంద్రహోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్‌ రాబోతున్నారు. కేంద్రప్రభుత్వానికి  అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించే అవకాశం ఉంటే, అమిత్ షా అధికారికంగానే నిర్వహిస్తారు," అని అన్నారు. 

కె.లక్ష్మణ్‌ వాదన నూటికి నూరుపాళ్లు వాస్తవమేనని అందరికీ తెలుసు. అయితే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాణ్ని అధికారికంగా జరిపితే నిజంగానే రాష్ట్రంలో ముస్లింలకు కోపం కలుగుతుందా?ఆనాడు జరిగిన దారుణ మారణఖాండను, అత్యాచారాలను, అవమానాలను రాష్ట్రంలో ముస్లింలు సమర్ధిస్తారా? తెరాస సర్కార్‌ విమోచన దినోత్సవం జరిపితే మజ్లీస్ అభ్యంతరం పెట్టగలదా? అంటే కాదనే చెప్పవచ్చు. ఒకవేళ చెపితే ఆనాడు జరిగిన అకృత్యాల గురించి తెరాస గట్టిగా చెప్పగలిగితే మజ్లీస్ పార్టీయే నష్టపోతుంది. కానీ ఒక సమస్యను సృష్టించుకొని, దానిని పరిష్కరించుకోవడానికి అంత శ్రమపడటం ఎందుకనే ఉద్దేశ్యంతోనే తెరాస సర్కార్‌ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడం లేదని భావించవచ్చు.


Related Post