ఎన్నికలు ఏకపక్షమే అయితే భయమెందుకు?

August 29, 2019


img

త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి వాటిలో తెరాస, ప్రతిపక్షాల బలాబలాలను అంచనా వేస్తామని తెలిపారు.

బుదవారం తెలంగాణ భవన్‌లో తెరాస ప్రధానకార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్‌, వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” ప్రజలు మనవైపే ఉన్నారు కనుక మున్సిపల్ ఎన్నికలలో తెరాస ఏకపక్షంగా విజయం సాధించడం ఖాయం. కనుక మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్‌, బిజెపిలు చేస్తున్న హడావుడిని పట్టించుకోనవసరం లేదు. అలాగని అతివిశ్వాసంతో కాంగ్రెస్‌, బిజెపిలను తక్కువగా అంచనావేయొద్దు. ఎక్కడికక్కడ ప్రతిపక్ష అభ్యర్ధుల బలాబలాలను బట్టి వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగాలి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటుచేసి వాటికి ఇన్-ఛార్జ్ లను నియమిస్తాను,” అని చెప్పారు. 

ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో తెరాసకున్న నేర్పు, వాటి నేతల శక్తియుక్తుల గురించి అందరికీ తెలిసిందే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు, ఏ ఎన్నికలకైనా తెరాస చాలా ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొంటుంది కనుకనే వరుస విజయాలు సాధిస్తోందని చెప్పవచ్చు. కానీ లోక్‌సభ ఎన్నికలలోనే తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అందుకే మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షమే అని అంటూనే మళ్ళీ అటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడుతున్నట్లు అర్దమవుతోంది. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్‌, బిజెపిలు పెద్దగా ఆసక్తిచూపకపోవడం తెరాసకు కలిసివచ్చే అంశమే అని చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తే మళ్ళీ తెరాసలో ఆత్మవిశ్వాసం, నూతనోత్సాహం పెరుగుతుంది.


Related Post