నివేదిక వచ్చేసింది...ఇక కూల్చేయడమే...

August 28, 2019


img

ఉద్దరిణిలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లు, సచివాలయం కూల్చివేయాలని ముందుగానే నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం శాస్త్ర ప్రకారం ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మళ్ళీ  సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయం ఖాళీ చేసేలోపుగా ఆ కమిటీ సచివాలయ భవన సముదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఒక నివేదికను తయారుచేసింది. బుదవారం సాయంత్రం దానిని నిపుణుల కమిటీ సభ్యులు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేతిలో పెట్టారు. 

తాము ఆ నివేదికపై అధ్యయనం చేసిన తరువాత కొత్త సచివాలయ నిర్మాణానికి సంబందించి అవసరమైన సలహాలు, సూచనలతో సిఎం కేసీఆర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 

సచివాలయాన్ని కూల్చివేయాలని సిఎం కేసీఆర్‌ ముందే నిర్ణయించుకున్నారు కనుకనే సచివాలయం ప్రాంగణంలో కొన్ని రోజుల క్రితమే కొత్త సచివాలయ భవనాలకు శంఖుస్థాపన కార్యక్రమం చేశారు. కనుక ఆయన మనసులో ఆలోచనలనే నిపుణుల కమిటీ సాంకేతిక పదాలలో చెప్పబోతోందని భావించవచ్చు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవడానికే మంత్రుల కమిటీ వేసినట్లు భావించవచ్చు. నివేదిక వచ్చేసింది కనుక దానిని హైకోర్టుకు సమర్పించి అనుమతి తీసుకొని త్వరలోనే సచివాలయం కూల్చివేత పనులు మొదలుపెట్టవచ్చు. ఇందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యకరమవుతుంది. (ఫోటో ఈనాడు సౌజన్యంతో) 


Related Post