యుద్ధానికి పాక్‌ ముహూర్తం పెట్టేసింది

August 28, 2019


img

“భారత్‌లో మళ్ళీ ఉగ్రవాదదాడి జరగడం ఖాయం...ఆ వంకతో భారత్‌ తమపై మళ్ళీ దాడిచేస్తే దానిని సమర్ధంగా తిప్పికొడతామని..అది చివరికి యుద్ధంగా మారి వినాశనానికి దారితీసినా ఆశ్చర్యం లేదని,” పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ స్వయంగా కొన్ని రోజుల క్రితమే అన్నారు. 

ఇప్పుడు పాక్‌ మరో అడుగు ముందుకు వేసి భారత్‌తో యుద్ధానికి ముహూర్తం కూడా పెట్టేసింది. పాక్‌ మంత్రి షేక్ రషీద్ రావల్పిండిలో మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌-పాక్‌ మద్య మరో యుద్ధం జరుగబోతోంది. ఈ అక్టోబర్-నవంబర్ నెల మద్యలో భారత్‌-పాక్‌ మద్య యుద్ధం జరుగవచ్చు. స్వాతంత్ర్యం కోసం చేస్తున్న చిట్టచివరి యుద్ధం అదే అవుతుంది. ఫాసిస్ట్ అయిన నరేంద్రమోడీ కశ్మీర్‌ను, పాకిస్థాన్‌ను విధ్వంసం చేయడానికి పూనుకున్నారు. ఆయన కారణంగానే ఇరుదేశాల మద్య యుద్ధవాతావరణం ఏర్పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలు ఆయన చర్యలను ఖండించడానికి ముందుకు రావడంలేదు. ఈ సమస్యపై మనం ఎలుగెత్తి పోరాడుతునప్పటికీ ముస్లిం దేశాలు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్ధం కావడంలేదు. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితుల తీవ్రతను గుర్తించి తక్షణమే కశ్మీర్‌లో ప్రజాభిప్రాయన సేకరణ జరిపించాలి. ఐక్యరాజ్యసమితి మా విజ్ఞప్తులను పట్టించుకొనప్పటికీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సెప్టెంబర్‌లో మరోసారి ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళతారు,” అని అన్నారు.

ఇదివరకు పాక్‌ ప్రధాని, ఇప్పుడు పాక్‌ మంత్రి చెపుతున్న మాటలను కలిపి చూసినట్లయితే అక్టోబర్-సెప్టెంబర్ నెలల్లో పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేసే అవకాశాలున్నాయని అర్ధం అవుతోంది. అప్పుడు భారత్‌ మళ్ళీ ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్‌ భూభాగంలోకి తన సైనికులనో, యుద్ధవిమానాలనో తప్పక పంపిస్తుందని, వాటిని తిప్పి కొట్టే ప్రయత్నంలో భారత్‌తో ప్రత్యక్షయుద్దానికి దిగే ఆలోచనలో పాక్‌ ఉన్నట్లు భావించవచ్చు. కనుక భారత్‌ నిఘా వర్గాలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా తదితర దేశాలు డాలర్లు విదిలిస్తే తప్ప రోజుగడవని దుస్థితిలో ఉన్న పాక్‌ భారత్‌తో యుద్ధానికి కాలుదువ్వుతుండటం చూస్తుంటే, మింగ మెతుకు లేదు...కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్లుంది.


Related Post