తూచ్! కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే: కాంగ్రెస్‌

August 28, 2019


img

కశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370 రద్దు సమయంలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా మాట మార్చి “కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే. దానిలో పాకిస్థాన్‌తో సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీలులేదు,” అంటూ వాదించడం మొదలుపెట్టింది. అందుకు బలమైన కారణమే ఉంది. 

ఈ సమస్యపై ప్రపంచదేశాలు తమకు మద్దతు ఇవ్వకపోవడంతో పాకిస్థాన్‌ దానిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. దానిలో తమ వాదనలను బలపరుచుకునేందుకు కశ్మీర్‌ సమస్యపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను సాక్ష్యంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

కశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370 రద్దు బిల్లులపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ ఆధీర్ రంజన్ “ఐక్యరాజ్యసమితి విచారణలో ఉన్న భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సమస్య..కశ్మీర్‌పై నరేంద్రమోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని” వాదించారు. 

ప్రధాని నరేంద్రమోడీని దేశప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్‌ నేతలు చేసిన ఇటువంటి వాదనలనే పాకిస్థాన్‌ సాక్ష్యాలుగా వాడుకొనే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది. దాంతో ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ స్వయంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి, “కశ్మీర్‌ బిల్లులపై మేము కేంద్రప్రభుత్వంతో విభేదించిన మాట వాస్తవం కానీ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమనే దానిపై మేము కేంద్రంవాదనతో ఏకీభవిస్తున్నాము. దానిలో పాకిస్థాన్‌తో సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీలులేదు. కశ్మీర్‌లో జరుగుతున్న దాడులు, హింసాత్మక సంఘటనల వెనుక పాకిస్థాన్‌ ఉందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశమని అందరికీ తెలుసు,” అని అన్నారు. 

గతంలో భారత్‌ ఆర్మీ పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద శిభిరాలను ద్వంసం చేసినప్పుడు, ఆ తరువాత భారత్‌ వాయుసేన బలాకోట్‌లో ప్రవేశించి వైమానిక దాడులు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఇదేవిధంగా పాకిస్థాన్‌ వాదనలను బలపరుస్తునట్లు మాట్లాడారు. అందుకే దేశప్రజలు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. అయినా కాంగ్రెస్‌ తీరుమారలేదు. కశ్మీర్ విషయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడి మరోసారి అడ్డంగా దొరికిపోయాక ఇప్పుడు “తూచ్...కేంద్రప్రభుత్వం వాదనలతో ఏకీభవిస్తున్నామని” నిసిగ్గుగా చెప్పుకోవడం వారికే చెల్లు.


Related Post