ఇది నిజమా.... బాబోయ్!

August 26, 2019


img

ఇటీవల బిజెపిలో చేరిన ఆంధ్రా ఎంపీ టిజి వెంకటేష్ ఇవాళ్ళ ఒక బాంబు పేల్చారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు కేంద్రప్రభుత్వానికి తెలిపారని మీడియాకు చెప్పారు. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు కేంద్రానికి తెలిపారని టిజి వెకటేశ్ చెప్పారు. కనుక అమరావతిలో రాజధానిని నిర్మించబోవడంలేదని జగన్ కేంద్రానికి తెలిపారన్నారు. జగన్‌ ఇదే ఆలోచనతోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులను డెప్యూటీ సిఎంలుగా నియమించుకున్నారని అన్నారు. ఈవిధంగా చేయడం వలన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి రాష్ట్రమంతటా సమానంగా అభివృద్ధి చెందుతుందని జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని కనుక ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. వాటికి రాజధానులు అనో లేదా ప్రణాళికా బోర్డులనో ఏపేరైనా పెట్టుకోవచ్చని అన్నారు. కానీ ఇదే జగన్ ఆలోచన అని టిజి వెంకటేష్ చెప్పారు. అయితే జగన్ తన ఆలోచనలను కేంద్రంతో పంచుకున్నంత మాత్రాన్న వాటికి కేంద్రం ఆమోదించినట్లు భావించడం సరికాదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే ప్రమాదం ఉందని టిజి వెంకటేష్ హెచ్చరించారు. 

ఒకవేళ టిజి వెంకటేష్ చెప్పింది నిజమే అయితే, గత 5 ఏళ్లుగా అమరావతి కబుర్లతోనే కడుపు నింపుకున్న ఆంధ్రా ప్రజలకు ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా అమరావతి రైతులకు, అక్కడ భారీగా భూములు కొన్న రాజకీయనాయకులకు ఇంకా పెద్ద షాక్ అవుతుంది.


Related Post