అందుకే కాళేశ్వరంకు జాతీయహోదా రాలేదట!

August 26, 2019


img

కాంగ్రెస్‌ మిత్రపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లున్నాయి. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆదిలాబాద్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జీవన్ రెడ్డి, తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు తెరాస సర్కార్‌పై నలువైపుల నుంచి ఒకేసారి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తునట్లుంది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రకు పూనుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇవాళ్ళ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు తుమ్మిడిహట్టి వద్దకు బయలుదేరుతున్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జగిత్యాలలో విలేఖరులతో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయహోదా రాకపోవడానికి కారణం కేంద్రం కాదు.. స్వయంగా సిఎం కేసీఆరే! దానికి జాతీయహోదా వస్తే ఆ ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు దానిలో జరిగిన అవినీతి అంతా బయటపడితే చిక్కులో పడతామనే భయంతోనే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కోసం గట్టిగా ప్రయత్నించడంలేదు. కానీ ప్రయత్నిస్తున్నట్లు... ఆ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించడం లేదన్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిజంగా జాతీయహోదా కోరుకొంటున్నట్లయితే దానిని కేంద్రానికి అప్పగించవచ్చు కదా? 

దేశంలో మరే రాష్ట్రంలో ఎవరూ ఎన్నడూ సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదన్నట్లుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. సిఎం కేసీఆర్‌ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనవసరమైన హైప్ సృష్టిస్తున్నారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నిటినీ సందర్శించి వాటి లోతుపాట్లగురించి ప్రజలకు వివరిస్తాము,” అని అన్నారు.


Related Post