కేసీఆర్‌ వైఖరి ఇలాగే కొనసాగితే... ఇంద్రసేనారెడ్డి

August 24, 2019


img

సీనియర్ బిజెపి నేత ఎన్‌.ఇంద్రసేనా రెడ్డి మళ్ళీ చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు. మంత్రులను సంప్రదించకుండా, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనీయకుండా ప్రభుత్వం అంటే  తానొక్కడినే అన్నట్లు సిఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ తన ఒంటెత్తు పోకడలతో రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేయడంతో సామాన్యప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లాలలో పాలన అస్తవ్యస్తం అయ్యింది. ఇప్పుడు సచివాలయం తరలింపుతో రాష్ట్రంలో అన్ని శాఖలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏ శాఖను, ఏ కార్యాలయాన్ని చూసినా అంతా గందరగోళమే. మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి మంత్రుల సలహాలు సూచనల మేరకు నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేస్తే ఇన్ని సమస్యలు ఉండేవి కావు కానీ సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోనో లేదా తన ఫార్మ్ హౌసులోనో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ రాష్ట్రంలో రాజరికపరిపాలన సాగిస్తున్నారు. ఇదేవిధంగా ముందుకు సాగుతున్నట్లయితే రాష్ట్రంలో తీవ్ర పాలనా సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది,” అని అన్నారు. 


Related Post