సఖ్యత కుదరదు..యుద్ధం తప్పదు

August 24, 2019


img

గత 5 ఏళ్ళపాటు తెలంగాణలో తెరాస-బిజెపిలు రాజకీయంగా విభేధించుకొంటున్నప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీ-సిఎం కేసీఆర్‌ల మద్య స్నేహం కారణంగా బిజెపి వలన తెరాస సర్కార్‌కు ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి నిశ్చయించుకుంది కనుక తెరాస సర్కార్‌ పట్ల దాని వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఏ చిన్న అవకాశం వచ్చిన రాష్ట్ర బిజెపి నేతలు తెరాస సర్కార్‌ను ఎండగడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, పధకాలు, సిఎం కేసీఆర్‌ వైఖరిపై నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 

నిజానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గతంలోనే తెరాసతో దోస్తీకి ప్రయత్నించారు కానీ తెరాస ఇష్టపడలేదు. రాష్ట్రంలో బలంలేని బిజెపితో దోస్తీ చేయవలసిన అవసరంలేదనే అభిప్రాయం, బిజెపితో దోస్తీ చేస్తే ముస్లింలు తెరాసకు దూరం అవుతారనే భయం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. 

కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో స్నేహం కొనసాగించడం కుదరదని, బిజెపిని ఎదుర్కోకపోతే రాజకీయంగా నష్టపోతామని సిఎం కేసీఆర్‌ కూడా గ్రహించినట్లే ఉన్నారు. కనుక బిజెపిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దం అయినట్లే ఉన్నారు. సభ్యత్వ నమోదు, విద్యుత్ కొనుగోళ్ళపై తెరాస-బిజెపిల మద్య మొదలైన మాటల యుద్దాలను గమనిస్తే, ఇంతవరకు సంయమనం పాటించిన  తెరాస ఇక బిజెపితో ప్రత్యక్ష యుద్ధానికి సిద్దం అయినట్లే కనిపిస్తోంది. 

బిజెపి కూడా సరిగ్గా ఇదే కోరుకొంటోంది కనుక ఆ పార్టీ నేతలు కూడా యుద్దానికి సై అంటున్నారు. అయితే తెరాసకు ఇక్కడే ఒక ఇబ్బంది ఉంది. కేంద్రంతో గొడవపడకుండా రాష్ట్రంలో బిజెపితో యుద్ధాలకే పరిమితం కావలసి ఉంటుంది. అలాగే తమ రాజకీయ యుద్ధాలలో కేంద్రం జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. లేదంటే ఏపీలో టిడిపి, చంద్రబాబునాయుడు, కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలాగ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

కనుక బిజెపితో తెరాస చాలా ‘బ్యాలెన్స్‌డ్‌’గా యుద్ధం చేయవలసి ఉంటుంది. సిఎం కేసీఆర్‌ సారధ్యంలో తెరాస బిజెపితో ఏవిధంగా బ్యాలెన్స్‌డ్‌గా యుద్ధం చేయబోతోందో...దానిలో బిజెపి పైచెయ్యి సాధించగలదో లేదో చూడాల్సిందే. 


Related Post