ఇప్పుడు పర్యటించి ఏం లాభం?

August 24, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కూడా మొదలైన తరువాత ఇప్పుడు తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిలో నీటి లభ్యత ఎంతుందో తెలుసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు బయలుదేరుతున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సోమవారం తమ్మిడిహట్టి పర్యటనకు బయలుదేరనున్నారు.

గతంలో తమ ప్రభుత్వం రూ.38,000 కోట్లు వ్యయంతో తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభిస్తే, సిఎం కేసీఆర్‌ కమీషన్ల కోసం దానిని రీడిజైనింగ్ చేసి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారనేది కాంగ్రెస్‌ నేతల ఆరోపణ. తమ్మిడిహట్టి వద్ద నిర్మించినట్లయితే గ్రావిటీ పద్దతిలో నీరు పారేవని కానీ మేడిగడ్డ వద్ద నిర్మించడం వలన అదే నీటిని ఎత్తిపోసుకోవలసివస్తోందని, దాని వలన నిర్వహణ వ్యయం పెరిగిపోయిందని, ప్రభుత్వంపై విద్యుత్ బిల్లుల భారం కూడా పడుతోందని కాంగ్రెస్‌ నేతల వాదన. రూ.38,000 కోట్లు వ్యయంతో పూర్తికావలసిన ఈ ప్రాజెక్టు వ్యయం సిఎం కేసీఆర్‌ ఏకంగా రూ.80,000 కోట్లుకు పైగా పెంచేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారనేది మరో ఆరోపణ. 

కనుక తమ ఆరోపణలను నిజమని నిరూపించుకునేందుకు, సిఎం కేసీఆర్‌ విమర్శలు చేసేందుకే కాంగ్రెస్‌ నేతల తమ్మిడిహట్టి పర్యటన ఉపయోగపడుతుంది తప్ప ఇప్పుడు తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించడం సాధ్యం కాదనే సంగతి వారికీ తెలుసు. అంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పర్యటన అని అర్ధం అవుతోంది. కానీ ఇది కాంగ్రెస్‌ పార్టీకి ఏవిధంగానూ ఉపయోగపడదని వారికీ తెలుసు. కనుక ఇటువంటి కార్యక్రమాలకు బదులు త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్దం అయితే ఉపయోగం ఉండేది.


Related Post