మూడు నెలలోనే ఏపీలో సీన్ రివర్స్?

August 22, 2019


img

జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా మే30న ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి నేటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ  సంచలనమైనవే. మొదట్లో సంక్షేమ పధకాలు, ఉద్యోగుల జీతాలు పెంపు, ఉద్యోగాల భర్తీ, మంత్రివర్గం ఏర్పాటు, శాసనసభ సమావేశాలు, కేసీఆర్‌తో స్నేహసంబందాలు వంటి నిర్ణయాలతో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెట్టి అభివృద్ధి పరుగులు పెట్టించగలరనే అందరిలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. 

కానీ అమరావతిలో చంద్రబాబునాయుడు నిర్మించి వినియోగించిన ప్రజావేదిక భవనం ఒక అక్రమ కట్టడం అనే కారణంతో దానిని కూల్చివేయడంతో రాష్ట్ర ప్రజలలో తొలిసారిగా వ్యతిరేకత మొదలైంది. ఆ తరువాత అవే కారణాలు చూపుతూ టిడిపి నేతల భవనాల కూల్చివేతలకు పూనుకోవడం, చంద్రబాబునాయుడుకు భద్రత తగ్గించడం, ఆయన నివాసంపై డ్రోన్ నిఘా వంటి పరిణామాలన్నీ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచించకుండా చంద్రబాబునాయుడు, టిడిపి నేతలపై కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాలు వెళ్ళాయి. వీటన్నిటిపై టిడిపి నేతలు చాలా చురుకుగా వ్యవహరించడంతో ఈ పరిణామాలను తమకు సానుకూలంగా మలుచుకోగలిగారు. ప్రజలలో మళ్ళీ చంద్రబాబునాయుడుపై సానుభూతి మొదలైంది. 

పేదప్రజల కడుపులు నింపుతున్న అన్నా క్యాంటీన్లను మూసివేయడం, ఇసుక రీచ్ లను నిలిపివేయడం, పోలవరం, అమరావతి పనులు నిలిపివేయడం, గ్రామవాలంటీర్ల నియామకాలలో వైసీపీ నేతల ప్రమేయం…ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన పరిణామాలతో సిఎం జగన్ పట్ల రాష్ట్ర ప్రజలలో అనుమానాలు, అసంతృప్తి మొదలయ్యాయి.

కేంద్రప్రభుత్వం వారిస్తున్నా జగన్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా అగ్రిమెంట్లను పునః సమీక్షించాలనుకోవడం, పోలవరం ఆధారిటీ వారిస్తున్నా రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారైనట్లు కనిపిస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాలపై కేంద్రప్రభుత్వం గట్టిగా అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గినట్లు సమాచారం. అలాగే రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోలవరం పనులు చేస్తున్న నవయుగ కంపెనీ పిటిషన్‌ వేయడంతో హైకోర్టు దానిపై స్టే విధించడంతో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 

ఇవన్నీ సరిపోవన్నట్లు తమ నిర్ణయాలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల ఆశీర్వాదాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి చెప్పడంతో బిజెపిని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టినట్లయింది. దాంతో రాష్ట్ర బిజెపి నేతలు తీవ్ర జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలన బాబు పాలనకు ఏమీ భిన్నంగా లేదని ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.   

జగన్‌కు దూకుడుగా, ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉందనే సంగతి తెలిసిందే. కానీ మంచికో చెడుకో ఆయన తీసుకొంటున్న నిర్ణయాలన్నీ ఈవిధంగా బెడిసికొడుతుండటంతో ప్రజలలో క్రమంగా అపనమ్మకం, అసహనం పెరుగుతోంది. 

మొదట్లో జగన్‌ను చూసి నేర్చుకోమని సిఎం కేసీఆర్‌కు ఉచిత సలహాలు ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు జగన్ ప్రస్తావన చేయడానికి వెనకాడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కనుక ఇకనైనా సిఎం జగన్‌ దూకుడు తగ్గించుకొని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్న పరిపాలన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదేమో? 


Related Post