నేతలతో లక్ష్యం సాధించడం సాధ్యమేనా?

August 22, 2019


img

తెలంగాణ తెరాస తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. కనుక దానిని ఎదుర్కొంటామని చెపుతున్న బిజెపి రాష్ట్రంలో అంత శక్తివంతంగా తయారుకాగలిగినప్పుడే అది సాధ్యం అవుతుంది. దాని కోసం ముందుగా రాష్ట్రంలో ప్రజలను మెప్పించవలసి ఉంటుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో సభ్యత్వనమోదు లక్ష్యం 18 లక్షలని నిర్ణయిస్తే, బిజెపి కేవలం 12 లక్షలే చేయగలిగింది. అదే తెరాసలో బిజెపికి 5 రేట్లు అంటే 60 లక్షల మంది చేరారు. అంటే ప్రజలు తమవైపే ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. అది నిజం కూడా. కనుక సిఎం కేసీఆర్‌ ప్రభావంలో ఉన్న తెలంగాణ ప్రజలను బిజెపి వైపు తిప్పుకోగలిగినప్పుడే దాని లక్ష్యం చేరుకోగలుగుతుంది. కానీ అది అంత సులువు కాదని అర్ధమైంది కనుక కాంగ్రెస్‌, టిడిపి, తెరాసలోని అసంతృప్త నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఆ పార్టీల నుంచి వచ్చిన నేతలకు సొంత క్యాడర్, ప్రజలలో కొంత సొంత గుర్తింపు ఉంటుంది కనుక వారిద్వారానే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రజలను మెప్పించనంత కాలం ఎంతమంది నేతలను చేర్చుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. 

ఉదాహరణకు అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను డ్డీకొనడానికి కాంగ్రెస్, టిడిపి, టిజేఎస్‌, సిపిఐ పార్టీలు చేతులు కలిపాయి. నాలుగు పార్టీలలో చాలా బలమైన నేతలే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌వైపు ఉండటంతో కాంగ్రెస్‌ కూటమి ఘోరంగా ఓడిపోయింది. కనుక ప్రజలు ఎవరివైపు ఉంటే వారిదే విజయమని స్పష్టమవుతోంది. 

ఒకవేళ ప్రజలను ఆకట్టుకోవడం సాధ్యం కాదనుకుంటే కర్ణాటక తరహా గేమ్ ఆడి అధికారం దక్కించుకోవలసి ఉంటుంది. కానీ తెలంగాణలో అది ఎన్నటికీ సాధ్యం కాదని కేటీఆర్‌ అన్నారు. కనుక రాష్ట్రంలో ఏవిధంగా ముందుకు సాగాలో బిజెపి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.


Related Post