ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వేరే చోటికి తరలబోతోందా?

August 20, 2019


img

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వేరే చోటికి తరలబోతోందా?అంటే మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు అవుననే సూచిస్తున్నాయి. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాజధాని అమరావతి ముంపుకు గురయ్యే ప్రాంతంలో నిర్మిస్తున్నందున, ముంపుకు గురికాకుండా చుట్టూ కాలువలు, ఆనకట్టలు నిర్మించి నీటిని మళ్లించవలసి వస్తోంది. ఆ కారణంగా నిర్మాణవ్యయం విపరీతంగా పెరుగుతోంది. దాని వలన ప్రజాధనం వృధా అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై అధనపు భారం పడుతోంది. కనుక అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది,” అని అన్నారు. 

అంటే జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతిని రాష్ట్రంలో వేరే చోటికి తరలించే ఆలోచనలో ఉన్నట్లు అర్ధమవుతోంది. బహుశః అందుకేనేమో జగన్‌ సిఎంగా ప్రమాణస్వీకారం చేయగానే రాజధాని నిర్మాణపనులన్నీ ఎక్కడివక్కడ నిలిపివేశారేమో? 

రాష్ట్ర విభజన తరువాత అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాజధానిని త్వరగా నిర్మించి రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరని ప్రజలు అధికారం కట్టబెడితే ఆయన సింగపూర్ కంపెనీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కాలక్షేపం చేయడంతో అమరావతి నిర్మాణం కాగితాలకు, కంప్యూటర్ గ్రాఫిక్స్ కే పరిమితమైంది. 

ఆయన నిర్మించలేకపోయారు కనుక జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయన మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించడానికి సిద్దమవుతున్నట్లున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మళ్ళీ కేంద్రం అనుమతులు, న్యాయవివాదాలు, నిధుల సమస్యలు, రాజకీయ యుద్ధాలు వగైరాలు మొదలవుతాయి. మళ్ళీ మొదటి నుంచి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది కనుక వచ్చే ఎన్నికలనాటికి కూడా ఇప్పటిలాగే అమరావతి అసంపూర్తి కట్టడాలతో దర్శనమీయవచ్చు. పాలకుల తప్పుడు లేదా అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం, ప్రజలు నష్టపోవలసి వస్తుండటం చాలా బాధాకరమే.


Related Post