కాంగ్రెస్‌ వ్యూహం అదే...పక్కా!

August 20, 2019


img

తెరాస-బిజెపిలు పరస్పరం లోపాయికారీగా సహకరించుకుంటున్నంత కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వాటిని ఎదుర్కోవడం కష్టమేనని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు బిజెపి ఎలాగూ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటోంది కనుక తెరాసకు దూరం జరిగింది. కానీ నేటికీ అవి లోపాయికారీగా సహకరించుకుంటున్న ఆధారాలు కనిపిస్తున్నాయి కనుక వాటి మద్య చిచ్చు రాజేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుంది. తెరాస సర్కార్ అవినీతి గురించి రోజూ విమర్శలు గుప్పిస్తున్న బిజెపి వాటిపై దర్యాప్తు జరిపించాలని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? అని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవదిలోనే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే ప్రశ్న అడగడం గమనిస్తే ఇది కాంగ్రెస్‌ తాజా వ్యూహామని అర్ధమవుతోంది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏమి చేసిందని దానిని ప్రజలు నెత్తిన పెట్టుకోవాలి? కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా సిఎం కేసీఆర్‌ అవసరమైనప్పుడల్లా దానికి మద్దతు ఇస్తుంటారు. అందుకు ప్రతిగా ఆయనపై ఉన్న సిబిఐ కేసును కదపకుండా అటకెక్కించేసింది. తెరాస-బిజెపిల మద్య నిజంగా ఎటువంటి రహస్య అవగాహన లేకపోతే కేంద్రప్రభుత్వం తెరాస సర్కార్‌పై అవినీతిపై దర్యాప్తు జరిపించి ఉండేది కదా?” అని అన్నారు.


Related Post