బిజెపి కోరుకొంటున్నది కూడా అదే!

August 19, 2019


img

నెలకో..రెండు నెలలకో డిల్లీ నుంచి బిజెపి నేతలు తెలంగాణ రావడం, బహిరంగసభ పెట్టి తెరాస సర్కార్‌పై విమర్శలు ఆరోపణలు గుప్పించడం, వెంటనే తెరాస వాటికి ఘాటుగా ప్రతివిమర్శలు చేయడం పరిపాటిగా మారింది. బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జెపి నడ్డా ఆదివారం హైదరాబాద్‌ వచ్చి వెళ్ళిన తరువాత అదే జరుగుతోంది. ఆయన తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించి వెళ్ళిపోయారు. ‘నడ్డా...అబద్దాల అడ్డా’ అంటూ తెరాస నేతలు ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి బిజెపి కోరుకొంటున్నది కూడా అదే. ఇప్పటి వరకు తెరాస రాష్ట్ర బిజెపిని పెద్దగా పట్టించుకునేది కాదు. నేటికీ కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్షంగా భావిస్తున్నాము... దానితోనే మాకు పోటీ అని చెప్పుకొంటోంది. అంటే బిజెపి ఉనికిని కూడా గుర్తించనట్లు నటిస్తోందన్నమాట. కనుక తెరాస నేతల చేత బిజెపి గురించి మాట్లాడిస్తేనే తెరాసకు బిజెపి సమ ఉజ్జీ అనే భావన ప్రజలకు కలుగుతుంది.

జెపి నడ్డా తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించి డిల్లీ తిరిగి వెళ్ళిపోయిన తరువాత బిజెపి ఆశించినట్లే తెరాస నేతలు బిజెపిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. తెరాస ఆవిధంగా వ్యవహరించాలనే బిజెపి కూడా కోరుకొంటోంది కనుక ఇప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు మళ్ళీ తెరాస సర్కార్‌పై ప్రతిదాడి చేస్తారు. కొన్ని రోజులు ఈ మాటల యుద్ధాలు సాగిన తరువాత రెండు పార్టీలు చల్లడతాయి. అప్పటికి మళ్ళీ డిల్లీ నుంచి అమిత్ షా లేదా మరొకరో వచ్చి మళ్ళీ విమర్శలు గుప్పించి ఈ వేడి చల్లారిపోకుండా చూస్తారు.

ఈవిధంగా తెరాస సర్కార్‌తో పోరాటాలు కొనసాగిస్తూ తెరాసకు బిజెపియే సమ ఉజ్జీ మరియు ప్రత్యామ్నాయమనే భావన ప్రజలలో కలిగించగలిగితే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఒక అడుగు ముందుకు వేసినట్లే భావించవచ్చు. 


Related Post