అలా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవచ్చా?

August 19, 2019


img

తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసుకొని అధికారం చేజిక్కించుకోవడమే తమ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విస్పష్టంగా ప్రకటించారు కనుక బిజెపి చర్యల వెనుక పరమార్ధం ఏమిటని ప్రత్యేకంగా కనిపెట్టనవవసరం లేదు. కనుక ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో పార్టీ ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నంలో ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పధకాలలో భారీగా అవినీతి జరిగిపోతోందని కాంగ్రెస్ నేతలతో గొంతు కలిపి కోరస్ పాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా నిన్న హైదరాబాద్‌ బహిరంగసభలో అదే స్టైల్లో తెరాస సర్కార్‌పై నిప్పులు చెరిగారు. 

రాష్ట్రంలో బిజెపి బలపడాలనుకుంటే ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయాలి. కనుక ప్రభుత్వ విధానాలను, అవినీతిని ఎండగట్టడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. అయితే, రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు, అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలలో లోపాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బిజెపి నేతలు వాటిపై దర్యాప్తు జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదు? అని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. 

ప్రాజెక్టులు, పధకాలపై బిజెపి నేతలు కేవలం విమర్శలు, ఆరోపణలు మాత్రమే చేస్తుంటారా? వాటికి కేంద్రప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు విడుదల చేయించడం లేదు?అనే తెరాస ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీల గురించి రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదు? అనే తెరాస ప్రశ్నలకు మౌనమే సమాధానం వస్తోంది. 

జాతీయవాదం, దేశభక్తిపై పేటెంట్ హక్కు ఉన్నట్లు మాట్లాడే బిజెపి నేతలు రాష్ట్రాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి  ఎందుకు సహకరించడం లేదు? కేంద్రానికి అత్యధికంగా పన్నులు రూపంలో ఆదాయం సమకూరుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి వారు ఎందుకు సహకరించడం లేదు? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఉదాహరణకు మిషన్ కాకతీయ చాలా మంచి ప్రాజెక్టు అని దానికి కనీసం రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ కేంద్రప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. కానీ మిషన్ కాకతీయలో అవినీతి జరిగిపోతోందని బిజెపి నేతలు గగ్గోలు పెడుతున్నారు. 

తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా, జరుగుతున్న అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆరోపణలు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారా లేక బిజెపికిదూరం అవుతారో బిజెపి నేతలే ఆలోచించుకుంటే మంచిదేమో?


Related Post