ఇక అటువంటి నిర్ణయాలు ఉండవు: అమిత్ షా

August 19, 2019


img

ఆదివారం డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా దేశరాజకీయాలను ప్రభావితం చేస్తున్న నిర్ణయాలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాక్‌ విభజన సమయం నుంచే మన దేశంలో కొన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు నిర్ణయాలు తీసుకోంటూ రాజాకీయాలు నడిపారు. దేశవిభజన నిర్ణయం కూడా అటువంటిదే. ట్రిపుల్ తలాక్, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, ఆర్టికల్ 35(ఏ) ఏర్పాటుచేయడం వంటివన్నీ కూడా అటువంటి ఓటు బ్యాంక్ నిర్ణయాలే. ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం ద్వారా అధికారం కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాల వలన దేశానికి, ఆ వర్గాల ప్రజలకు కూడా చాలా అన్యాయం జరుగుతోందనే సంగతిని గత పాలకులు విస్మరించారు. కానీ మా ప్రభుత్వం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచే రాజకీయాలు చేయబోదు. దేశ ప్రయోజనాలు, యావత్  దేశ ప్రజలందరి ప్రయోజనాలే ప్రధానంగా నిర్ణయాలు తీసుకొంటుంది. ట్రిపుల్ తలాక్, కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాలు అటువంటివే,” అని అన్నారు. 

అమిత్ షా వాదన సహేతుకంగానే ఉన్నప్పటికీ, నరేంద్రమోడీ ప్రభుత్వం ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ చట్టంపై ముస్లిం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ మతవ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశేషమేమిటంటే, వారి అసంతృప్తిని, ఆ కారణంగా బిజెపి పట్ల పెరిగిన వ్యతిరేకతను కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయ మైలేజీ పొందాలనుకొంటున్నాయి. అందుకే అవి కశ్మీర్‌, ట్రిపుల్ తలాక్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే కొన్ని పార్టీలు నేటికీ కొన్ని వర్గాలను సంతృప్తి పరిచి రాజకీయ మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తుంటే, మిగిలిన వర్గాల ప్రజలను సంతృప్తి పరిచి రాజకీయ మైలేజీ పొందేందుకు మరికొన్ని  పార్టీలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టం అవుతోంది.


Related Post