పాక్‌ పిచ్చి ఆలోచనలు

August 17, 2019


img

పాక్‌ విదేశాంగ మంత్రి  షా మహ్మద్‌ ఖురేషీ మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కశ్మీర్‌పై మనం చేస్తున్న పోరాటానికి ఐక్యరాజ్యసమితి కానీ ప్రపంచదేశాలు గానీ మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడటంలేదని పాక్‌ ప్రజలు గ్రహిస్తే బాగుంటుంది. కనుక పాక్‌ ప్రజలు ఈ అంశంపై కాస్త వివేకంతో ఆలోచించాలి,” అని హితవు పలికారు. ఆయన చెప్పినట్లుగానే చైనా అభ్యర్ధన మేరకు కశ్మీర్‌పై చర్చించేందుకు శుక్రవారం రహస్య సమావేశం నిర్వహించిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఎటువంటి ప్రకటన చేయకుండా ముగించింది. దానిలో పాల్గొన్న రష్యా, ఫ్రాన్స్, మరికొన్ని దేశాలు ఇది ద్వైపాక్షిక సమస్య అని భారత్‌-పాక్‌ చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించడంతో పాక్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది.

భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచదేశాలు ఖండించనప్పుడే పాక్‌ వెనక్కు తగ్గి ఉండాలి కానీ భారత్‌పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న కారణంగా వరుసగా తప్పటడుగులు వేసి నవ్వులపాలవుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భంగపాటు ఎదురైనప్పటికీ వెనక్కు తగ్గకుండా ఈసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. విదేశాలలో ఉన్న తమ అన్నిరాయబార కార్యాలయాలలో కశ్మీర్‌ కోసం ప్రత్యేకంగా ‘కశ్మీర్‌ సెల్’ ను ఏర్పాటు చేయబోతున్నట్లు షా మహ్మద్‌ ఖురేషీ తెలిపారు. కశ్మీర్‌ కోసం భారత్‌తో ఎన్ని వందల సంవత్సరాలైనా పాకిస్థాన్‌ పోరాడుతూనే ఉంటుందని షా మహ్మద్‌ ఖురేషీ చెప్పారు.

గత ఏడు దశాబ్ధాలుగా పాక్‌ పోరాడుతూనే ఉంది కానీ ఎటువంటి ఫలితం లభించలేదు. కశ్మీర్‌ సమస్యపై ప్రపంచదేశాల వైఖరిని గమనిస్తే ఇక ముందు కూడా ఎటువంటి ఫలితం ఉండబోదని స్పష్టం అవుతోంది. ఇటువంటి నిరర్ధకపోరాటం చేసే బదులు, పాకిస్థాన్‌లో తిష్టవేసుకున్న ఉగ్రవాదులను ఏరివేసి తమ దేశాభివృద్ధి కోసం పాక్‌ పాలకులు గట్టి ప్రయత్నాలు చేస్తే ఎప్పటికైనా పాక్‌ బాగుపడుతుంది. కాదని భారత్‌తో నిరర్ధకపోరాటం చేస్తూ కూర్చుంటే పాక్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారడం ఖాయం. ఇప్పటికే సౌదీ అరేబియా, అమెరికా, చైనాలు విదిలిస్తున్న డాలర్లతో అతికష్టం మీద దేశాన్ని నడిపిస్తున్న పాకిస్థాన్‌ అప్పుడు ఏవిధంగా మనుగడ సాగించగలదో పాక్‌ పాలకులు ఆలోచించుకుంటే మంచిది. 


Related Post