రాష్ట్ర సంపద పెరిగితే ఆరోగ్యశ్రీ బాకీలు ఎందుకు తీర్చలేదు?

August 17, 2019


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నిత్యం సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో సిఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలవలన రాష్ట్ర సంపద రెట్టింపయ్యిందని చెప్పారు. 

దానిపై కె.లక్ష్మణ్‌ స్పందిస్తూ, “ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులు రూ.1,500 కోట్లు బకాయిలు పేరుకుపోవడంతో అవి సేవలు నిలిపివేశాయి. ప్రభుత్వం తమకు రూ. 1500 కోట్లు బాకీ ఉందని అవి చెపుతుంటే, ఆరోగ్యశ్రీ ట్రస్టు రూ.800 కోట్లు మాత్రమే చెల్లించవలసి ఉందని చెపుతోంది. కానీ వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ రూ.600 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని చెపుతున్నారు. లెక్కలలో ఇన్ని వందల కోట్లు తేడా వస్తోందంటే ఏమనుకోవాలి? అయినా మంత్రి ఈటల మాటలనే పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు రూ.600 కోట్లు బాకీ ఉందని స్పష్టం అవుతోంది. రాష్ట్ర సంపద రెట్టింపయ్యిందని రెండు రోజుల క్రితమే సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పుకొంటున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దులు ఫీజ్ రీఇంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతోంది?బకాయిలు చెల్లించక పోవడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలివేసినందున రాష్ట్రంలో పేద ప్రజలు ఆలాడిపోతున్నారు. ఫీజ్ రీఇంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వలన విద్యార్దులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగులు బడ్జెట్ తో చేతికి అందిన రాష్ట్రాన్ని సిఎం కేసీఆర్‌ 5 ఏళ్లలో దివాళా తీయించేశారు,” అని కె.లక్ష్మణ్‌ విమర్శించారు. 



Related Post