కేసీఆర్‌ వినలేదు అందుకే... కె.లక్ష్మణ్‌

August 16, 2019


img

సమసి పోయిందనుకున్న ఇంటర్ పరీక్షల వివాదం మళ్ళీ మెల్లగా రాజుకుంటోంది. రాష్ట్రంలో 26 మంది ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలపై కేంద్రహోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో మళ్ళీ దీనిపై వేడి రాజుకొంది. నిజానికి ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఎటువంటి అవకతవకలు జరుగలేదని, ప్రతిపక్షాలు వాటి అనుకూల మీడియా కలిసి కుట్ర పూరితంగా తన ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకు పనిగట్టుకొని దుష్ప్రచారం చేశాయని సిఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో అన్నట్లు వార్తలు వచ్చాయి. 

వాటిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పందిస్తూ, “అది కుట్ర కాదు..అధికారుల, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస అర్హత లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్ బోర్డు ఈ బాధ్యత ఎందుకు అప్పగించింది. ఇంటర్ ఫలితాలలో తప్పులు దొర్లాయని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చెప్పినా గ్లోబరీనా సంస్థపై, ఇంటర్ బోర్డు అధికారులపై ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? విద్యార్దుల మరణాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని, విద్యార్దుల కుటుంబాలకు న్యాయం చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. అందుకే మేము కేంద్రహోంశాఖకు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది. కానీ ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకొని, చనిపోయిన విద్యార్దుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము,” అని కె.లక్ష్మణ్‌ అన్నారు. 

గతంలో తెరాస పట్ల బిజెపి మెతకవైఖరితో వ్యవహరిస్తున్నప్పుడు ఇటువంటివి జరిగితే బిజెపి మొక్కుబడిగా స్పందిస్తూండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని నిర్ణయించుకున్నందున తెరాస పట్ల బిజెపి వైఖరిలో పెనుమార్పు వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ తెరాసతో పోరాడుతుండేది. ఇప్పుడు కాంగ్రెస్‌ స్థానంలోకి  బిజెపి ప్రవేశించి గట్టిగా పోరాడుతోంది. 

దీని నుంచి తెరాస సర్కార్ నేర్చుకోవలసిన ఒక కొత్త విషయం ఉంది. ఇకపై ప్రతిపక్షాలు...ముఖ్యంగా బీజేపీ నేతలు, ఎంపీలు ఏదైనా సమస్య పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వదలిస్తే నిరాకరించకుండా తీసుకోవడం మంచిది. లేకుంటే ప్రతీ సమస్యపై కేంద్రానికి పిర్యాదులు వెళుతూనే ఉంటాయని గుర్తుంచుకోవాలి. కనుక సమస్యలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరించుకోవడం మంచిదా లేక ఈవిధంగా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం కల్పించడం మంచిదా? అని తెరాస సర్కార్ ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది.


Related Post