ఇంటర్ గందరగోళం ఒక కుట్ర: కేసీఆర్‌

August 16, 2019


img

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ గురువారం రాజ్‌భవన్‌లో అధికార, ప్రతిపక్ష నేతలకు తేనీటి విందునిచ్చారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబీర్ ఆలీ తదితరుల వద్దకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించడం విశేషం. 

రాష్ట్రంలో 26 మంది ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలపై కేంద్రహోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో తెరాస సర్కారులో ఆందోళన మొదలైనట్లుంది. సిఎం కేసీఆర్‌ ఇదే విషయాన్ని నిన్న గవర్నర్‌ నరసింహన్‌ వద్ద ప్రస్తావించి, ఇంటర్ గందరగోళం తన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు నేతలు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పెద్ద కుట్ర అని చెప్పినట్లు తెలుస్తోంది. వారికి వత్తాసు పలికే మీడియా ద్వారా దీనిపై జోరుగా దుష్ప్రచారం సాగించారని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన అన్ని చర్యలు తీసుకొందని తెలిపారు. కానీ ఒక పార్టీకి చెందిన నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకా దానిపై రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఇంటర్ గందరగోళంకు దారి తీసిన పరిస్థితులు, వాటిని నివారించేందుకు తన ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ త్వరలోనే రాష్ట్రపతికి సమగ్రనివేదిక అందజేయబోతున్నట్లు సిఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపారు. 

తెరాస ఏవిధంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం పావులు కదుపుతుందో అలాగే ప్రతిపక్షాలు కూడా ఇటువంటి సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించడం సహజం. రాష్ట్రంలో బిజెపి బలపడి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటోంది కనుక అది ఈ సమస్యని ఉపయోగించుకొని తెరాసపై పైచెయ్యి సాధించాలనుకోవడం సహజమే. కనుక ఒకవేళ దీనితో బిజెపి తమను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తే దానిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెరాసయే ఆలోచించుకోవలసి ఉంటుంది. 

సచివాలయం కూల్చివేతపై కూడా ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. న్యాయపోరాటాలు కూడా చేస్తున్నాయి. ప్రతిపక్షాలు తమపై కుట్రలు చేస్తున్నాయని వాపోవడం వలన ప్రయోజనం ఉండదు కనుక వాటినీ తెరాస సర్కార్ ఎదుర్కోక తప్పదు.


Related Post