హుజూర్‌నగర్‌పై వాటికి పట్టు దొరుకుతుందా?

August 13, 2019


img

హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆ స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్నాయి. కనుక దానిని దక్కించుకోవడానికి కాంగ్రెస్‌, తెరాస, బిజెపి మూడు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. 

ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా తన అర్ధాంగి పద్మావతీ రెడ్డిని బరిలో దించడం ద్వారా నియోజకవర్గంపై తమ పట్టు నిలుపుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తుంటే, ఈసారి హుజూర్‌నగర్‌ స్థానాన్ని గెలుచుకొని రాష్ట్రంలో తమకు ఆదరణ పెరిగిందని నిరూపించుకోవాలని బిజెపి భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగలడంతో కంగుతిన్న తెరాస హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలను ఓడించి, లోక్‌సభ ఎన్నికలలో వాటి గెలుపు యాదృచ్చికమేనని, తమ ప్రభుత్వానికి ప్రజాధారణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలలో సభ్యత్వనమోదు ప్రక్రియ ముగిసినా హుజూర్‌నగర్‌లో మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. బిజెపి కూడా హుజూర్‌నగర్‌లో జోరుగా సభ్యత్వనమోదు ప్రక్రియను కొనసాగిస్తోంది. 

ఈ నేపధ్యంలో హుజూర్‌నగర్‌లో ఏ పార్టీ ఓడిపోయినా దానికి చాలా ఇబ్బందికర పరిస్థితులెదుర్కోవలసి వస్తుంది. కాంగ్రెస్‌ ఓడిపోతే రాష్ట్రంలో ఇక దాని మనుగడ కష్టమేననే అభిప్రాయం బలపడుతుంది. బిజెపి ఓడిపోతే రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం కేవలం ‘యాక్సిడెంటల్’ అనే కాంగ్రెస్‌, తెరాస వాదనలకు బలం చేకూరుతుంది. ఒకవేళ బిజెపి చేతిలో తెరాస ఓడిపోతే రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికలనాటికి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని బిజెపి నేతలు గట్టిగా చెప్పుకోవడానికి అవకాశం లభిస్తుంది. కనుక మూడు పార్టీలకు హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలు చాలా కీలకమైనవే.


Related Post