తెరాస-బిజెపి-కాంగ్రెస్‌ మూడు ముక్కలాట

August 13, 2019


img

తెరాస ఒకటనుకుంటే జరిగింది మరొకటి. రాష్ట్రంలో తెరాసకు ఎదురే ఉండొద్దని కాంగ్రెస్,టిడిపిలను ఫిరాయింపులతో నిర్వీర్యం చేస్తే, ఇప్పుడు వాటి స్థానంలో వాటి కంటే చాలా చాలా బలమైన బిజెపి చేరింది. ఇంతవరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని బిజెపి ఆశపడుతోంది. రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో బిజెపికి ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరిగింది. అందుకే కాంగ్రెస్‌, తెరాసలను టార్గెట్ చేసుకొని రాష్ట్ర బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  

మతతత్వ మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని సిఎం కేసీఆర్‌ బిజెపిని విమర్శించడం ఏమిటని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కారు స్టీరింగు ఓవైసీ సోదరుల చేతిలో ఉందని బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వారికి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి సిఎం కేసీఆర్‌ వెనకాడుతున్నారని కె.లక్ష్మణ్‌ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌, తెరాసల మద్య లోపాయికారి ఒప్పందం ఉందని, రాష్ట్రంలో బిజెపి బలపడకుండా అడ్డుకునేందుకే ఉత్తమ్ కేసీఆర్‌, కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురూ కలిసి నాటకాలు ఆడుతున్నారని, వాటిలో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ఆత్మహత్యకు సిద్దమైందని బిజెపి నేతలు వాదిస్తున్నారు.       

మజ్లీస్‌-తెరాసల స్నేహంపై బిజెపి చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజల మనసుల్లో నాటుకుంటే రాష్ట్రంలో బిజెపి బలపడే అవకాశం ఉంటుందనే ఆలోచన, భయం తెరాసలో మొదలైనట్లే కనిపిస్తోంది. కనుక ఇప్పుడు తెరాస నేతలు ఇదివరకులా మజ్లీస్ నేతలతో రాసుకుపూసుకు తిరగడం తగ్గించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మళ్ళీ వారి స్నేహం కొత్త చిగుర్లు వేస్తుందేమో చూడాలి.           

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెరాసల తప్పటడుగుల కారణంగానే రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బిజెపి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగిందనే వాదన వినిపిస్తోంది. ఆ వాపును చూసి బిజెపి బలుపు అని భ్రమపడుతోందని తెరాస, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పిస్తున్నాయి. దమ్ముంటే మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి చూపాలని తెరాస కాంగ్రెస్‌, బిజెపిలకు సవాలు విసురుతోంది.     

బిజెపి-తెరాసల మద్యనే మంచి ‘అండర్ స్టాండింగ్’ ఉందని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. కీలకమైన బిల్లులకు తెరాస మద్దతు ఇవ్వడం అందుకు నిదర్శనమని కాంగ్రెస్‌ వాదిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కోరుతున్న తెరాస, కేంద్రం అందుకు అంగీకరించకపోయినా కేంద్రానికి ఎందుకు మద్దతు పలుకుతోందని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.  

కాంగ్రెస్‌, బిజెపిలు దొందూ దొందే...వాటి వలన తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేదని తెరాస వాదిస్తోంది. బిజెపికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేయాలనే యావే తప్ప రాష్ట్రంపై ఎటువంటి ప్రేమ లేదని తెరాస వాదన. ఉన్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి, విభజన హామీలను అమలుచేయాలని సవాలు విసురుతోంది. మూడు పార్టీల మద్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాలన్నీ ఆధిపత్యపోరుగానే భావించవచ్చు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో కాలమే చెపుతుంది.


Related Post