భారత్‌ నుంచి కశ్మీర్‌ విడిపోవడం ఖాయం: వైకో

August 13, 2019


img

తమిళనాడులోని ఎండీఎంకే పార్టీ అధినేత వైకో కశ్మీర్‌ అంశంపై తీవ్రంగా స్పందించారు. “కశ్మీర్‌ విషయంలో కాంగ్రెస్‌, బిజెపిలు మొదటి నుంచి నేటి వరకు వరుసగా తప్పులే చేస్తున్నాయి. అయితే ఈవిషయంలో కాంగ్రెస్‌ 30 శాతం, బిజెపి 70 శాతం తప్పులు చేసిందని భావిస్తున్నాను. మోడీ ప్రభుత్వం కశ్మీర్‌పై బురద జల్లి ఏదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతోంది. ఈ నిర్ణయం వలన కశ్మీర్‌ భారత్‌కు మరింత దూరం అవుతుంది. భారత్‌ 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి భారత్‌లో కాశ్మీర్ ఉండదు,” అని అన్నారు. 

గత 70 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పాలకులు కశ్మీర్‌లో ఉన్న భిన్నమైన పరిస్థితులను, అక్కడి ప్రజల మనోభావాలను గమనించకుండా రాజకీయాలు చేయడం వలననే నేడు ఈదుస్థితి ఏర్పడిందని చెప్పకతప్పదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కశ్మీర్‌పై మరో కొత్త ప్రయోగం చేయబోతోంది. ఇది ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలంటే ముందుగా కాశ్మీర్ ప్రజలకు కేంద్రప్రభుత్వంపై నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. కశ్మీరీలకు విద్యా, ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచగలిగితే వారికి భారత్‌ ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది అప్పుడు మెల్లమెల్లగా వారు వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, పాక్‌ ఊబిలో నుంచి బయటపడి భారత్‌తో మమేకం కాగలుగుతారు. 

అయితే కశ్మీర్‌ అభివృద్ధి కంటే ముందు, కశ్మీర్‌లో కారుచవకగా భూములు కొనేయాలని ఆశపడుతున్న రాజకీయనేతలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను కేంద్రప్రభుత్వం అడ్డుకోవలసిన అవసరం ఉంటుంది. అలాగే ‘ఇకపై అందమైన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్ళి చేసుకోవచ్చు’ వంటి వికృత ఆలోచనలను నిర్ద్వందంగా ఖండించడమే కాకుండా అటువంటి ప్రయత్నాలకు ముందే అడ్డు కట్టవేయాల్సిన అవసరం ఉంటుంది లేకుంటే భారతీయ నేతలు, వ్యాపారులు తమ సంస్కృతీ సాంప్రదాయాలను ఛిన్నాభిన్నం చేసి, తమ  ఆస్తులను,మహిళలను దోచుకునేందుకు వస్తున్నారనే భయం కశ్మీరీలలో మొదలవుతుంది. అదే జరిగితే కశ్మీర్‌పై ఎన్ని లక్షల కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేలమంది భద్రతాదళాలను మోహరించినా కశ్మీర్‌ ఎన్నటికీ భారత్‌తో మమేకం కాకపోవచ్చు. 

భారత్‌కు క్యాన్సర్ మహమ్మారిలా మారిన కశ్మీర్‌ సమస్యకు మోడీ ప్రభుత్వం చేస్తున్న చికిత్సలు ఫలించి అక్కడ మళ్ళీ శాంతి ఏర్పడితే యావత్ ప్రపంచం ఆయనకు జేజేలు పలుకుతుంది. అదే నోట్లరద్దులా బెడిసికొడితే వైకో చెప్పినట్లు భారత్‌ నుంచి కశ్మీర్ విడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కశ్మీర్‌లో ఆశించిన సత్ఫలితాలు రావాలంటే రాజకీయాలకు అతీతంగా చాలా జాగ్రత్తగా ముందుకు సాగవలసి ఉంటుంది. Related Post