సరిహద్దులకు పాక్‌ యుద్ధ సామాగ్రి తరలింపు!

August 12, 2019


img

కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పాకిస్థాన్‌ పాలకులు మండిపడుతున్నారు. పాక్‌ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు పాక్‌ ఏమీ చేయలేకపోయింది. ఆ తరువాత భారత్‌ వాయుసేన పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాద శిబిరాలపై క్షిపణులతో దాడులు చేసినప్పుడు ఏమీ చేయలేకపోయింది. భారత్‌పై ప్రతీకారం రగిలిపోతున్న సమయంలో తమ చేతికి చిక్కిన భారత్‌ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి అయిష్టంగా అప్పగించవలసి వచ్చింది. అలాగే తమ చేతికి చిక్కిన మాజీ భారత్‌ నేవీ అధికారి కులభూషణ్ యాదవ్‌పై గూడచర్యం ఆరోపణలు మోపి ఉరిశిక్ష విదించినప్పటికీ, అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ దానిని సమర్ధంగా అడ్డుకోవడంతో చేతిలో ఉన్న ఖైదీని శిక్షించలేక పాకిస్థాన్‌ మరోసారి అవమానకర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. 

ఇప్పుడు మోడీ ప్రభుత్వం కశ్మీర్‌పై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే, తమకు పెద్దన్నలాగా తోడునీడగా నిలిచే చైనాతో సహా ప్రపంచదేశాలేవీ అండగా నిలబడకపోవడంతో దౌత్యపరంగా కూడా భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ మరోసారి పరాభవం ఎదురైంది. మోడీ ప్రభుత్వం చేతిలో వరుసగా ఇన్ని పరాభవాలు ఎదుర్కోవలసివస్తుండటంతో పాక్‌ పాలకులు, సైన్యాధికారులు భారత్‌పై భగభగ మండిపోవడం సహజమే. కనుక భారత్‌ను కవ్వించేందుకు మళ్ళీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు. 

జమ్ముకశ్మీర్‌ నుంచి విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రపాలిత ప్రాంతం లడ్డాక్‌కు అతిసమీపంలో పాక్‌ సరిహద్దువైపున్న స్కర్దు ఎయిర్‌బేస్‌కు పాక్‌ వాయుసేనకు చెందిన రెండు రవాణా హెలికాఫ్టర్లు భారీగా యుద్ధ సామాగ్రిని తీసుకువస్తున్నట్లు భారత్‌ సరిహద్దు భద్రతాదళాలు గుర్తించాయి. దీంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. 

కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయాల వలన మళ్ళీ పుల్వామా తరహా దాడులు జరుగవచ్చని, అప్పుడు భారత్‌ మళ్ళీ తమని నిందిస్తూ దాడులకు ప్రయత్నించవచ్చని, ఒకవేళ భారత్‌ అటువంటి దుసాహసానికి పాల్పడితే ఈసారి ధీటుగా తిప్పికొడతామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ముందే హెచ్చరించారు కనుక యుద్ధసామాగ్రి తరలింపును పాక్‌ సమర్ధించుకోవచ్చు. కానీ ప్రపంచదేశాలు తమవైపు లేవని తెలిసి ఉన్నప్పటికీ పాక్ పాలకులు మళ్ళీ ఇటువంటి కవ్వింపు చర్యలకు పూనుకోవడం విశేషం. ఒకవేళ ప్రపంచదేశాలు ఒత్తిడి కారణంగా మళ్ళీ వెనక్కు తగ్గవలసివస్తే అది తమకు మరో పరాభవం అవుతుందని పాక్ పాలకులు గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 


Related Post