కశ్మీర్ అంశంతో తెలంగాణలో బిజెపి బలపడగలదా?

August 12, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలలో మంచి చెడు, వాటి లాభనష్టాలను పక్కనపెడితే, గత కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోలిస్తే మోడీ ప్రభుత్వం నిస్సందేహంగా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటోందని దేశప్రజలందరూఅంగీకరిస్తారు. అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలలో జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్స్ 35 (ఏ), 370ల రద్దు కూడా ఒకటి. వీటిపై కూడా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కారణాలు అందరికీ తెలుసు. 

ప్రధాని మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వలన భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనే ప్రశ్నకు కాలమే సమాధానం చెపుతుంది. కశ్మీర్ తేనెతుట్టెలో ప్రధాని మోడీ అనవసరంగా వేలుపెట్టి కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 70 ఏళ్ళకు పైగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని మోడీ ధైర్యంగా ఒక కొత్త ప్రయత్నం చేశారనే అభిప్రాయం, వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. 

కనుక ప్రధాని మోడీ పట్ల దేశప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడిందని...దాని వలన బిజెపికి రాజకీయంగా సానుకూల వాతావరణం ఏర్పడిందని బిజెపి నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో బిజెపి పట్ల సానుకూల దృక్పదం ఏర్పడిందని రాష్ట్ర బిజెపి నేతలు అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ బలహీనపడటం, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుండటం వలన బిజెపికి మరింత సానుకూలరాజకీయ వాతావరణం ఏర్పడిందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బిజెపి నేతలు భావిస్తున్నారు. 

అయితే కశ్మీర్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించినా ఆ కారణంగా తెరాసను కాదని బిజెపివైపు మొగ్గు చూపుతారనుకోలేము. ఎందుకంటే తెలంగాణ సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధికి నరేంద్రమోడీ ప్రభుత్వం సహకరిస్తోందా లేదా? అని మాత్రమే చూస్తారు తప్ప ఒక జాతీయ సమస్యను పరిష్కరించినందుకు బదులుగా రాష్ట్రంలో అధికారం కట్టబెడతారనుకోలేము. కానీ మోడీ నిర్ణయాలను సమర్ధిస్తున్నవారు బిజెపిని సమర్ధించకపోయినా, మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నవారు తప్పకుండా తెరాస, కాంగ్రెస్‌ లేదా మరో పార్టీవైపు వెళ్లిపోవడం ఖాయం. కనుక ఈ అంశం నుంచి రాష్ట్ర బిజెపి రాజకీయ మైలేజీ పొందడం కష్టమేనని చెప్పవచ్చు.


Related Post