ఏపీలో భారీగా ఉద్యోగాలు...తెలంగాణలో ఎప్పుడో?

July 20, 2019


img

తెలంగాణలో తెరాస 5 ఏళ్ళ పాలన తరువాత మళ్ళీ 2వసారి అధికారంలోకి వచ్చింది కానీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని ఇంతవరకు నెరవేర్చలేకపోయింది. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నెలరోజులు కూడా పూర్తికాకమునుపే భారీగా ఉద్యోగాలను సృష్టిస్తూ అంతేవేగంగా భర్తీ కూడా చేస్తోంది. ఇటీవల సుమారు 2 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి వాటి భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తోంది. అవి ప్రభుత్వోద్యోగాలు కానప్పటికీ, జీతం కేవలం రూ.5,000 అయినప్పటికీ ఒకేసారి 2 లక్షల మంది నిదుద్యోగులకు ప్రభుత్వమే పని కల్పించి ఆదాయమార్గం చూపించడం గొప్పవిషయమే కదా?  

ఒకపక్క శరవేగంగా గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే, జగన్ నవరత్నాల హామీలలో ఒకటైన గ్రామ సచివాలయాల ఏర్పాటుకు కూడా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో సచివాలయంలో పాత ఉద్యోగులతో కలిపి కనీసం 10మంది శాశ్విత ఉద్యోగులు ఉండే విధంగా మొత్తం 91,652ఉద్యోగాల భర్తీకి ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు నిర్ధిష్టమైన గడువు కూడా విధించింది. ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 14లోపుగా ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, అక్టోబర్ 2 నుంచి అందరూ విధులలో చేరేవిధంగా కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. అంటే కేవలం రెండు నెలలోగానే 91,652ఉద్యోగాలు భర్తీ చేయబోతోందన్నమాట! గ్రామ సచివాలయాల ఏర్పాటు, దాని విధులు, భాద్యతలు, అధికారాలకు సంబందించి మార్గదర్శకాలను కూడా ఏపీ సర్కార్ విడుదల చేసింది.

ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంతవేగంగా ఇంతభారీగా ఉద్యోగాల భర్తీ చేయగలుగుతున్నప్పుడు, ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న తెలంగాణ సర్కార్ ఐదున్నరేళ్ళు గడిచిపోయినా ఇంకా ఉద్యోగాల భర్తీకి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందో? కోర్టు కేసుల కారణంగా ఉద్యోగాల భర్తీలో ఆలస్యమవుతోందని ప్రభుత్వం సమర్ధించుకోవచ్చు. కానీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తామన్న హామీని  అమలుచేయడానికి ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదో తెలియదు. ఎన్నికల సమయంలో నిరుద్యోగభృతి గురించి చాలా గొప్పలు చెప్పుకున్న తెరాస నేతలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఎందుకో? ఇంకా అదెప్పుడు ఇస్తారో? ఎంతమందికి ఇస్తారో చూడాలి. 


Related Post