అందుకే రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరలేదా?

July 20, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. రెండు రోజుల క్రితమే తనను బిజెపిలోకి రమ్మని ఎవరూ ఆహ్వానించలేదని, తాను కూడా బిజెపిలోకి వెళ్ళాలనుకోవడం లేదని, నేటికీ తాను కాంగ్రెస్‌ సభ్యుడినేనని అన్నారు. అంటే బిజెపిలో చేరే ఆలోచన విరమించుకొన్నట్లు అర్ధం అవుతోంది. కానీ మళ్ళీ అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు.  

శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “బిజెపిలోకి నేనొక్కడినే కాదు...నాతో పాటు నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చేరబోతున్నారు. మేమిద్దరం బిజెపిలో చేరుతున్నమంటే తెరాసకు భయం పుట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది. సోనియా, రాహుల్ గాంధీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ టైటానిక్ షిప్ చాలా గొప్పదని చెప్పి మునిపోతున్న ఆ నావలో ఉండిపోలేము కదా? అందుకే నేను బిజెపిలో చేరాలనుకొంటున్నాను. మావంటి సీనియర్ నేతలు బిజెపిలో చేరితే ఆ పార్టీ రాష్ట్రంలో బలపడుతుంది. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగగలుగుతుంది. నేను బిజెపిలో ఏ పదవులు ఆశించడం లేదు. ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను,” అని అన్నారు. 

సుమారు నెల రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు కానీ నేటికీ చేరలేదు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకురావాలని బిజెపి షరతు విధించి ఉండవచ్చు. కానీ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకొంటున్నందున ఆయనను ఒప్పించేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది కనుక ఒకవేళ వెంకట్‌రెడ్డికి బిజెపిలో కానీ కేంద్రప్రభుత్వంలోగాని ఏదైనా మంచి పదవి ఇచ్చినట్లయితే అంగీకరిస్తారేమో? కోమటిరెడ్డి సోదరులిద్దరూ బిజెపిలోకి వెళతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవిధంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేని నిస్సహాయస్థితిలో ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.


Related Post