కుమారస్వామికి డెడ్‌లైన్ నెంబర్:3

July 19, 2019


img

కర్ణాటకలో మొదట కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత సంక్షోభంగా మొదలైన ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం అనేక మలుపులు తిరిగి ఇప్పుడు కాంగ్రెస్‌, జెడిఎస్ ప్రభుత్వానికి-రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ కు మద్య ఘర్షణగా మారింది. 

గురువారం సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని కుమారస్వామి ప్రభుత్వానికి మొదట డెడ్‌లైన్ విధించిన గవర్నర్ వాజుభాయ్, శాసనసభ నేటికీ వాయిదా పడటంతో ఈరోజు మధ్యాహ్నం 1.30లోగా బలనిరూపణ చేసుకోవాలని మరో డెడ్‌లైన్ విధించారు. కానీ ఈ విషయంలో తాను గవర్నర్ వాజుభాయ్ ఆదేశాలను పాటించనవసరం లేదని, ఆయనకు తనను ఆదేశించే హక్కు లేదని స్పీకర్ రమేశ్ కుమార్ తెగేసి చెప్పి సభను మళ్ళీ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. తన ఆదేశాలను పాటించబోనని స్పీకర్ రమేశ్ కుమార్ తెగేసి చెప్పినప్పటికీ గవర్నర్ వాజుభాయ్ పటేల్‌ మళ్ళీ మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల లోపుగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. 

అయితే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను సభకు రప్పించేవరకు ఏదోవిధంగా చర్చలతో కాలక్షేపం చేయాలని కుమారస్వామి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిని ఎడ్యూరప్ప నేతృత్వంలో బిజెపి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న బలనిరూపణ చేయకుండా సభను నేటికీ వాయిదా వేసినందుకు నిరసనగా ఎడ్యూరప్పతో సహా బిజెపి ఎమ్మెల్యేలు అందరూ నిన్న రాత్రి శాసనసభలోనే పడుకున్నారు. బహుశః ఈరోజు కూడా వారికి శాసనసభలోనే నిద్రపోక తప్పదేమో? కానీ ఈ వ్యవహారంలో గవర్నర్ స్వయంగా రంగంలో దిగారు కనుక నేడోరేపో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యం లేదు.


Related Post