తెరాస సర్కార్... మరో భగీరధ ప్రయత్నం

July 19, 2019


img

మిషన్ భగీరధ వంటి ఒక అద్భుతమైన పధకాన్ని చేపట్టిన తెరాస సర్కార్ ఇప్పుడు హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన ఇబ్రాహీం పట్టణం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, హయాత్ నగర్, సరూర్ నగర్, షామీర్ పేట, కీసర, కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, పటాన్ చెరు ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు అందించేందుకు మరో భగీరధ ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ప్రాంతాలలో అనేక పెద్ద టౌన్ షిప్స్ వస్తుండటంతో అక్కడ జనాభా కూడా విపరీతంగా పెరిగింది. కానీ పెరిగిన జనాభాకు తగ్గట్లు త్రాగునీరు లేకపోవడంతో అక్కడ నివశిస్తున్న ప్రజలు రోజూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

కనుక ఆ 12 మండలాలకు రూ.890 కోట్లు వ్యయంతో త్రాగునీటి సరఫరా చేయడానికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించి, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సమర్పించింది. దానికి ఆమోదం లభిస్తే కేంద్రప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పుడు కావలసినంత నీటిని వినియోగించుకునే అవకాశం ఏర్పడటంతో అక్కడి నుంచి నీటిని తీసుకొని, స్థానికంగా ఒక్కోటి 30 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన 15 సర్వీస్ రిజర్వాయిర్లను నిర్మించి దానిలో నిలువ చేయాలనేది తాజా ప్రతిపాదన. అక్కడి నుంచి సుమారు 1,200 కిమీ పొడవునా పైప్ లైన్లు వేసి ఆ 12 మండలాలలో ప్రతీ ఇంటికీ నిరంతరంగా నీటిసరఫరా చేయాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రతిపాదించింది. ఇప్పటికే ఔటర్‌రింగ్‌ రోడ్డు రింగ్ రోడ్ మొదటి దశలో భాగంగా 190 గ్రామాలకు నీటిని అందిస్తోంది. తాజా ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే, 2020 చివరినాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. తెరాస సర్కార్ సంకల్పించిన ఈ భగీరధ ప్రయత్నం ఫలిస్తే ఇక హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో భవిష్యత్ లో ఎన్నడూ త్రాగునీటి సమస్య ఉండకపోవచ్చు.


Related Post