కన్నడ సంక్షోభం కంటిన్యూస్

July 19, 2019


img

కర్ణాటక ప్రభుత్వంలో 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో తలెత్తిన రాజకీయ సంక్షోభం సస్పెన్స్ త్రిల్లర్ సినిమాను తలపిస్తూ అనేక మలుపులు తిరుగుతూ నేటికీ ఇంకా సాగుతూనే ఉంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతే అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపి, అందుకోసం రాష్ట్ర గవర్నర్ వాజూభాయి పటేల్ సహకారం తీసుకోవడంతో ఈ సంక్షోభం వెనుక బిజెపి హస్తం ఉందని తేటతెల్లమైంది. బిజెపి ఎమ్మెల్యేల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన గవర్నర్ వాజూభాయి పటేల్ గురువారం సాయంత్రంలోగా శాసనసభలో బలం నిరూపించుకోవాలని ఆదేశిస్తూ సిఎం కుమారస్వామికి ఒక లేఖ వ్రాశారు. కానీ నిన్న సాయంత్రం సభలో నాటకీయ పరిణామాల తరువాత స్పీకర్ సభను నేటికీ వాయిదా వేశారు. దాంతో గవర్నర్ వాజూభాయి పటేల్ ఈరోజు మధ్యాహ్నం 1.30లోగా బలనిరూపణ చేసుకోవాలని కుమారస్వామికి మరో లేఖ ద్వారా సూచించారు. కానీ సభా కార్యక్రమాలు, సభ నిర్వహణపై తనను గవర్నర్ కానీ సుప్రీంకోర్టు గానీ ఆదేశించలేరని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. తాను గవర్నర్ ఆదేశాలను పట్టించుకోబోనని స్పీకర్ తెగేసి చెప్పారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం మొదలవగానే మధ్యాహ్నం 1.30 వరకు సభలో బిజెపి-కాంగ్రెస్‌, జెడిఎస్ సభ్యుల మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనంతరం భోజన విరామం కొరకు సభను మధ్యాహ్నం 2.30కు వాయిదా వేశారు. 

స్పీకర్ పరిధిలో ఉండే శాసనసభా వ్యవహారాలలో గవర్నర్‌ జోక్యం చేసుకోలేరనే స్పీకర్ వాదన సరైనదే కావచ్చు. కానీ కాంగ్రెస్‌-జెడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గవర్నర్ కూడా సిద్దమైనట్లు స్పష్టమయ్యింది కనుక ఇప్పుడు ఆయన దీనినే ఒక సాకుగా చూపి, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది కనుక రాష్ట్రపతిపాలన విధించాలని కోరే అవకాశాలు కనబడుతున్నాయి. 


Related Post