విలీనం రాజ్యాంగబద్దమే...నా?

July 19, 2019


img

శాసనసభలో నిన్న నాలుగు బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని తప్పు పడుతూ సిఎం కేసీఆర్‌ను విమర్శించారు. వాటిపై సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ, “మేమెవరినీ మా పార్టీలో చేరాలని బలవంతం చేయలేదు. వారంతట వారే వచ్చి చేరారు. ఎమ్మెల్యేలలో 1/3 వంతు మంది అంగీకరిస్తే వేరే పార్టీలో విలీనం చేయవచ్చు కనుక రాజ్యాంగం ప్రకారమే ఈ విలీనం జరిగింది. ఆంధ్రా, గోవా రాష్ట్రాలలో కూడా ఇటువంటి విలీనాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతే అందుకు మమ్మల్ని నిందించడం సరికాదు,” అని అన్నారు.

 ఇదే అంశంపై ఈరోజు ఒక తెలుగు న్యూస్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఓ కాంగ్రెస్‌ నేత మాట్లాడుతూ, “ఏ పార్టీ తరపున పోటీ చేసి గెలిచినా అందరూ అధికార పార్టీలోనే చేరకతప్పదన్నట్లు తెరాస సర్కార్ వ్యవహరిస్తోంది. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందన్నమాట. ఆ లెక్కన కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాలలో వేరే పార్టీలు అధికారంలో ఉన్నాయి కనుక తెరాస పట్ల బిజెపి కూడా అదేవిధంగా వ్యవహరిస్తే సహించగలదా? 

తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నామని చెపుతున్నారు. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తెరాస సర్కార్ నిధులు విడుదల చేయదని అంగీకరించిందనుకోవచ్చా?అయినా ఒకరొకరుగా వచ్చి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయకుండా వారందరూ ఒకేసారి వచ్చి చేరారన్నట్లు తెరాసలో విలీనం చేసుకోవడం సబబేనా? టెక్నికల్‌గా ఇది సరైనదేనని సమర్ధించుకోవచ్చు కానీ కేసీఆర్‌ చేస్తున్నది అనైతికం, అప్రజాస్వామికమని ఆయనకు తెలుసు. నయాన్నో, భయాన్నో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసుకొని వారిని మేము కాపాడుకోలేకపోయమంటున్నారు. అంటే ఎమ్మెల్యేల చుట్టూ కంచె వేసి కాపాడుకోవాలా? ఇదేనా మీరు చెప్పుకునే ప్రజాస్వామ్యం?” అని నిలదీశారు.


Related Post