రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్: కేసీఆర్‌

July 19, 2019


img

తెలంగాణ పురపాలక చట్టం-2019పై నేడు శాసనసభలో జరుగుతున్న చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రజలకు మరింత సులువుగా పురపాలక సేవలు అందుబాటులోకి తెస్తూనే, ఎక్కడా అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ చట్టంలో చాలా కటినమైన నిబందనలు విధించామని తెలిపారు. ఈ చట్టం లోపరహితంగా ఉండేవిధంగా ప్రతీ అక్షరం తానే దగ్గరుండి వ్రాయించానని చెప్పారు. కొంతమందికి ఇది అసంతృప్తి కలిగించవచ్చు కానీ యావత్ రాష్ట్ర ప్రజలకు, నిర్మాణ సంస్థలకు ఎంతో మేలు చేకూరుస్తుందని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

కొత్త చట్టం ప్రకారం పేదప్రజలు నిర్మించుకునే 75 గజాలలోపు ఇళ్ళకు (జి+1) రిజిస్ట్రేషన్ ఛార్జీ కేవలం ఒక్క రూపాయి మాత్రమేనని చెప్పారు. ఇకపై ఇళ్ళు నిర్మించుకునేవారే తమ ఇంటి ప్లాను ప్రకారమే ఇళ్ళు నిర్మించుకొంటామని, దానిని అతిక్రమించబోమని లిఖితపూర్వకంగా హామీ (సెల్ఫ్ సర్టిఫికేషన్)ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ తెలిపారు. వారు దరఖాస్తు సమర్పించిన 15 రోజులలోపుగా తప్పనిసరిగా ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని, ఒకవేళ చేయనట్లయితే అనుమతి మంజూరు అయినట్లుగానే పరిగణించవచ్చునని చెప్పారు. 

ఒకవేళ ప్లాన్‌ను అతిక్రమించి కడితే 25 రేట్లు జరిమానా విధించడంతో పాటు అవసరమైతే ఇల్లు కూల్చివేయడానికి పురపాలకసంఘాలకు అధికారం కట్టబెట్టామని తెలిపారు. అలాగే అనుమతులు లేకుండా ఇళ్ళు, భవనాలు నిర్మించినా ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసేందుకు ఈ చట్టంలో వెసులుబాటు కల్పించామని తెలిపారు. 

500 చదరపు గజాల నుంచి 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడే ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు కూడా నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు అభించేవిధంగా చట్టంలో నిబందనలు రూపొందించమని సిఎం కేసీఆర్‌ తెలిపారు. 

కలెక్టర్ అధ్వర్యంలో పనిచేసే ఫ్లయింగ్ స్క్వాడ్ ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలపై నిఘా పెడుతుందని, అవసరమైతే కొలతలు తీయించి ప్లాన్‌కు విరుద్దంగా లేదా అతిక్రమించి కట్టబడిన వాటిని కూల్చివేసేందుకు అధికారం కలిగి ఉంటుందని సిఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ వ్యవహారాలలో ప్రజాప్రతినిధులు, మంత్రుల ప్రమేయం, ఒత్తిడి లేకుండా ఉండేవిధంగా కొత్త చట్టంలో నిబందనలు రూపొందించమని సిఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలు మరింత సులువుగా ఇళ్ళు  నిర్మించుకోవడానికి, అదే సమయంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టం రూపొందించామని సిఎం కేసీఆర్‌ తెలిపారు.


Related Post