తూచ్...బిజెపిలో చేరడం లేదు: రాజగోపాల్ రెడ్డి

July 18, 2019


img

గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేస్తూ బిజెపిలో చేరబోతున్నట్లు చెప్పుకున్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హటాత్తుగా మాట మార్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నన్ను బిజెపివాళ్ళు పార్టీలోకి ఆహ్వానించలేదు... నేను వెళ్ళాలనుకోవడం లేదు. నేటికీ నేను కాంగ్రెస్‌ సభ్యుడినే. నేనేమీ యూ టర్న్ తీసుకోలేదు. రాష్ట్రంలో తెరాసకు బిజెపి ప్రత్యామ్నాయమనే నా వాదనకు కట్టుబడి ఉన్నాను. రాష్ట్ర నాయకత్వంపై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓడిపోవడానికి నాయకత్వలోపమే కారణమని గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెపుతున్నాను. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన తరువాతైనా పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉండేది.” అని అన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత క్రిందటి నెలలో తన నియోజకవర్గంలోని  అనుచరులతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను పదవుల కోసం పార్టీ మారాలనుకోవడం లేదు. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సిఎం కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతున్నాను. నా పార్టీని, నా సుశీ కంపెనీని ఛిన్నాభిన్నం చేసిన కేసీఆర్‌కు నేను దాసోహం అనదలచుకోలేదు. చివరివరకు ఆయనతో పోరాడాలనే నిశ్చయించుకున్నాను. తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ కాళ్ళ దగ్గర తాకట్టు పెడదామా లేక పోరాడి కేసీఆర్‌ను గద్దె దించుదామా? మీరే ఆలోచించుకోండి. నేను ఎవరినీ నాకూడా బిజెపిలోకి రమ్మనమని బలవంతం చేయను. నాతో వచ్చే వారిని కాదనను. నా ఏకైక లక్ష్యం ఏనాటికైనా కేసీఆర్‌ను గద్దె దించడమే. ఆ లక్ష్యసాధన కోసమే కొత్త మార్గం ఎంచుకొంటున్నాను. ఏనాటికైనా నా నిర్ణయం సరైనదేనని మీరూ అంగీకరిస్తారు,” అని అన్నారు. అప్పుడు ఆయన అనుచరులే తీవ్రంగా వ్యతిరేకించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, రాజగోపాల్ రెడ్డి కావాలనుకుంటే బిజెపిలోకి వెళ్లవచ్చని నిర్మొహమాటంగా చెప్పి సమావేశంలో నుంచి లేచి వెళ్ళిపోయారు. 

బిజెపిలో చేరేందుకు సిద్దపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తాను యూ టర్న్ తీసుకోలేదని, నేటికీ కాంగ్రెస్ సభ్యుడినేనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయనను బిజెపి చేర్చుకోలేదా లేదా వేరే ఏదైనా కారణం చేత ఇప్పుడే బిజెపిలో చేరకూడదని నిర్ణయించుకున్నారా? అనేది త్వరలోనే బయటపడక మానదు.


Related Post