ప్రతిపక్షాలు అభద్రతాభావంలో ఉన్నాయి అందుకే...

July 16, 2019


img

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరూ కలిసి నిన్న గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్‌ నరసింహన్‌ సెక్షన్:8 కింద తనకున్న అధికారాన్ని వినియోగించి కూల్చివేతలను అడ్డుకోవాలని ప్రతిపక్ష నేతలు కోరారు. 

దీనిపై తెరాస తరపున ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడించేలా అత్యాధునికమైన సచివాలయం, శాసనసభ భవనాలను నిర్మిస్తామంటే ప్రతిపక్ష నేతలు ఎందుకు బాధపడిపోతున్నారు? సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి నీటిని అందిస్తుండటంతో ప్రజలందరూ కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు తమను పక్కనపెడుతుండటంతో ప్రతిపక్షాలు తీవ్ర అభద్రతాభావంతో..ఆందోళనతో ఉన్నాయి. బహుశః అందుకే...మా ప్రభుత్వం సాధిస్తున్న ఈ విజయాలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా అవరోదంగా మారుతున్నాయి. ఈవిధంగా వ్యవహరిస్తున్నందుకే ప్రజలు వారిని ఇంకా దూరం పెడుతున్నారని మరిచిపోకూడదు. ఇకనైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే వారికే మంచిది. లేకుంటే వారే ఇంకా నష్టపోతారు,” అని అన్నారు. 



Related Post