కాంగ్రెస్‌ను బలహీనపరిచి తెరాస సమస్య కొనితెచ్చుకుందా?

July 16, 2019


img

రాష్ట్రంలో ఇప్పటి వరకు తెరాసకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండేది కానీ ఫిరాయింపులతో అది బలహీనపడటంతో ఇప్పుడు బిజెపి దాని స్థానంలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. తెరాసకు ఇది ఊహించని  పరిణామమే అని చెప్పవచ్చు. ఎందుకంటే, గత 5 ఏళ్ళలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా రాష్ట్రంలో బిజెపి గెలవలేకపోయింది. కనీసం తన ఉనికిని చాటుకోలేకపోయింది. కనుక తెరాస నేతలు ఏనాడూ బిజెపిని తమ ప్రత్యర్ధిగా భావించలేదు. కనీసం దానిని పట్టించుకొనేవారు కాదు. 

ఈ నేపద్యంలో కాంగ్రెస్‌, టిడిపిలను బలహీనపరిస్తే చాలు...ఇక రాష్ట్రంలో తెరాసకు తిరుగే ఉండదని భావించేవారు. కానీ సిఎం కేసీఆర్‌ అనుకొన్నది ఒకటైతే జరిగింది మరొకటి. లోక్‌సభ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావడంతో ఇప్పుడది దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించడం మొదలుపెట్టింది. వాటిలో తెలంగాణ కూడా ఒకటి. 

గతంలో ప్రధాని నరేంద్రమోడీతో సిఎం కేసీఆర్‌ స్నేహం కారణంగా రాష్ట్రంలో బిజెపి నేతల చేతులు కాళ్ళు కట్టేయగలిగారు కానీ ఇప్పుడు తెరాసను డ్డీకొనాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌ వచ్చి స్వయంగా యుద్దభేరి  మ్రోగించడంతో రాష్ట్ర బిజెపి నేతలు సమరోత్సాహంతో ఊగిపోతున్నారు. 

అయితే వారు తెలంగాణ ప్రజల ఆదరణ, మద్దతుతోనే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటే నేటికీ బిజెపి గురించి తెరాస ఆలోచించనవసరమే లేదు. కానీ బిజెపి కూడా తెరాస బాటలోనే సాగుతూ తెరాసతో సహా ఇతర పార్టీల నేతలను, ప్రజాప్రతినిధులను బిజెపిలోకి ఫిరాయింపజేసుకోవడం ద్వారా బలపడి, తెరాసను రాజకీయంగా దెబ్బ తీయాలనుకొంటోంది. దానినీ తెరాస ఏదోవిధంగా ఎదుర్కొని బిజెపిని నిలువరించగలదు. కానీ బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఐ‌టి, ఈడి, సిబిఐ వంటి సంస్థలను అధికారపార్టీ నేతలపైకి ఉసిగొల్పి పశ్చిమబెంగాల్, కర్ణాటక తరహాలో తెరాసలో చిచ్చుపెట్టి దొడ్డిదారిలో అధికారం కైవసం చేసుకొనే ప్రమాదం కనబడుతోంది. అదే తెరాసను ఎక్కువ ఆందోళనకు గురి చేస్తోందని చెప్పవచ్చు. ఏపీలో టిడిపి ఓడిపోగానే సుజనా చౌదరి, సిఎం రమేశ్, టిజి వెంకటేష్ వంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బిజెపిలో చేరిపోవడానికి ఇదే కారణమనేది బహిరంగ రహస్యమే. కనుక తెరాస నేతలను కూడా బిజెపి అదేవిధంగా లొంగదీసుకునే ప్రయత్నం చేయవచ్చునని భావించవచ్చు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం వలననే తెరాసకు ఈ కొత్త సమస్య ఎదురైందని చెప్పవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌ సగం బలంతో ఉన్నా దానితో పోరాడటం తెరాసకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే అది కేంద్రంలో అధికారంలో లేదు కనుక అది కాగితపు పులి మాత్రమే. కానీ ఆ కాగితపు పులి స్థానంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అనే నిజం పులిని తెరాస చేజేతులా కొనితెచ్చుకొంది.

గతంలో మోడీతో స్నేహం చేయడం ద్వారా సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బిజెపికి ముక్కుతాడు వేయగలిగారు కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు కనుక బిజెపిని ఎదుర్కోవడానికి మరోమార్గం అన్వేషించవలసి ఉంటుంది. తెరాస, బిజెపిల మద్య జరుగబోయే ఈ ఆదిపత్యపోరులో చివరికి ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి. అయితే రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు, అండదండలు ఉన్నంతకాలం తెరాసను కదిలించడం బిజెపికి కష్టమేనని చెప్పవచ్చు.


Related Post