దీక్షలు-అరెస్టులు-బెయిలు... ఎక్కడి సమస్యలు అక్కడే!

July 15, 2019


img

సంగారెడ్డి పట్టణానికి గోదావరి జలాలు సరఫరా చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేటి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరాహారదీక్షకు సిద్దమవగా, కొండాపూర్ పోలీసులు ఆయనను దారిలోనే అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. 

మన రాజకీయ నాయకులు ఏదో ఒక సమస్యను లేవనెత్తి దాని పరిష్కారం కోసం దీక్షలు చేయడం... అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రికో లేదా స్టేషన్‌కో తరలించడం... ఆ తరువాత వారు దీక్ష విరమించడం... ఈ కధ అందరికీ తెలిసిందే. 

అయితే వారు ఏ సమస్య పరిష్కారం కోరుతూ దీక్షకు కూర్చోన్నారో ఆ సమస్య మాత్రం పరిష్కారం కానేకాదు. వారు ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పుడు దానిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కనీసం దానిపై ప్రభుత్వం స్పందించాలని ప్రజలు ఆశిస్తారు. కానీ ప్రభుత్వం దానిని ఒక రాజకీయ చర్యగా మాత్రమే చూస్తుంది కనుక అధికార పార్టీ నేతలెవరో దీక్షకు కూర్చోన్న వారిపై విమర్శలు గుప్పిస్తారు. ఆ ప్రజాసమస్యకు అదే ముగింపు అవుతుంటుంది. 

ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతకాలమైన ప్రభుత్వంతో పోరాడుతామని చెప్పే ప్రతిపక్ష నేతలు ఆ సమస్యపై పోరాటంతో మీడియాను, ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంటే తప్ప మళ్ళీ దాని జోలికి వెళ్లరు. అంటే వారు చేసిన పోరాటంపై వారికే చిత్తశుద్ది లేదని స్పష్టం అవుతోంది. 

కనుక ప్రజాసమస్యలపై అటు ప్రభుత్వం స్పందించక, ఇటు ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతాయి. ఈ కేసులో సంగారెడ్డి పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య కూడా అలాగే నిలిచిపోతుంది. త్వరలో వర్షాలు పడితే ఈ సమస్య తీరిపోతుంది కనుక మళ్ళీ ఏడాది వరకు ఈ సమస్య గురించి ఎవరూ ఆలోచించరు. 

గ్రామస్థాయి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కోసం అన్ని పార్టీలు తమ ప్రజాప్రతినిధులను, కార్యకర్తలు, నేతలందరినీ రంగంలో దించి అనుకున్న సమయంలోగా  తమ ‘టార్గెట్ రీచ్’ అయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ  అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు ఇంత పెద్ద నెట్ వర్క్ ఉన్నప్పటికీ ఇటువంటి ప్రజాసమస్యలను పరిష్కారించలేకపోవడం... కనీసం అటువంటి ఆలోచన, తపన, పట్టుదల లేకపోవడం ప్రజల దురదృష్టమనే భావించాలి.


Related Post