తెరాసకు కొరకరాని కొయ్యగా మారిన డిఎస్

July 12, 2019


img

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తెరాసకు కొరకరాని కొయ్యగా మారినట్లున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెరాస మాజీ ఎంపీ కవిత స్వయంగా సిఎం కేసీఆర్‌కు కొన్ని నెలల క్రితం లేఖ వ్రాశారు. కానీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వేరే పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించినట్లవుతుందనే ఆలోచనతో ఇంతకాలం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, పార్టీకి దూరంగా పెట్టారు. 

లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్‌లో కవిత ఓటమికి ఆయన కూడా కారణమని తెలిసి ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపుకు అవకాశం కల్పించకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయనపై తెరాస ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనుక నేటికీ ఆయన తెరాస ఎంపీయే కనుక ఇటీవల డిల్లీలో జరిగిన తెరాస పార్లమెంటరీ సమావేశానికి పిలవని పేరంటంలా వచ్చి హాజరవడంతో తెరాస ఎంపీలు షాక్ అయ్యారు. వారు ఈవిషయాన్ని సిఎం కేసీఆర్‌ చెవిలో వేశారు. పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరవకపోతే తప్పు కానీ హాజరైతే కాదు కనుక ఈసారి కూడా ఆయనపై తెరాస చర్యలు తీసుకోలేకపోయింది. 

ఆ సమావేశం తరువాత ఆయన డిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన సిఎం కేసీఆర్‌ కుమార్తె కవితను భారీ మెజార్టీతో ఓడించారు. కనుక ఆయన కూడా బిజెపిలో చేరాలనుకుంటే ఆశ్చర్యం లేదు. 

ఇంతకాలం ఆయన తెరాసకు ఇబ్బంది, నష్టం కలిగిస్తున్నప్పటికీ వేరే పార్టీలోకి వెళ్ళకుండా అడ్డుకొనేందుకే తెరాస ఆయనపై సస్పెన్షన్ వేటు వేయలేదు. కానీ ఒకవేళ ఆయన బిజెపిలో చేరితే ముందుగా అనర్హత వేటు వేసి ఆ తరువాత పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు. ఈవిషయం ఆయనకు కూడా బాగా తెలుసు కనుక రాజ్యసభ పదవీకాలం ముగిసేవరకు తెరాసలోనే కొనసాగవచ్చు. అంటే అంతవరకు తెరాస ఆయనను భరించాల్సి ఉంటుంది లేదా వదిలించుకోవాలంటే సస్పెన్షన్ వేటు వేయక తప్పదన్నమాట. తెరాసకు బహుశః ఇటువంటి సమస్య ఎప్పుడూ ఎదురయ్యి ఉండదేమో?


Related Post