బిజెపి వార్నింగ్స్ షురూ!

July 11, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి గెలుస్తుందో లేదోనని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందారు కానీ వారి భయాలను పటాపంచలు చేస్తూ గతంలో కంటే చాలా భారీ మెజార్టీతో బిజెపి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. పైగా పశ్చిమ బెంగాల్లో 18, తెలంగాణలో 4ఎంపీ సీట్లు బోనస్‌గా గెలుచుకోవడంతో బిజెపి వైఖరిలో, ఆ పార్టీ నేతల కంఠస్వరంలో చాలా మార్పు వచ్చింది. 

ఇక తమకు తిరుగులేదని...గట్టిగా ప్రయత్నిస్తే మిగిలిన రాష్ట్రాలను కూడా చేజిక్కించుకోవచ్చుననే నమ్మకం వారిమాటలలో ప్రస్పుటంగా కనబడుతోంది. గతంలో తెరాసను ఎదుర్కోవడానికి తటపటాయించిన తెలంగాణ బిజెపి నేతలు ఇప్పుడు ‘తెరాసకు మేమే ప్రత్యామ్నాయమని, కేసీఆర్‌ను గద్దె దింపబోయేది తామేనని’ గట్టిగా నొక్కి చెపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 117 స్థానాలకు పోటీ చేసి ఒకే ఒక స్థానం మాత్రమే గెలుచుకోగలిగిన బిజెపి నేతలు ఇప్పుడు ఈవిధంగా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యకరంగానే ఉంది కానీ వారి మాటలు మారిన బిజెపి వైఖరికి అద్దం పడుతున్నాయి. 

తెలంగాణలో కంటే ఇంకా దయనీయస్థితిలో ఉన్న ఏపీ బిజెపి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ అక్కడి నేతలు కూడా అప్పుడే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వార్నింగులు ఇవ్వడం ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం కూడా బాబు ప్రభుత్వం లాగే వ్యవహరిస్తోందని, ఇదే తీరు కొనసాగిస్తే జగన్‌కు కూడా   బాబుకు పట్టిన గతే పడుతుందని ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, బిజెపి నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ హెచ్చరించారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి నేతలు ఇంకా మాటలకే పరిమితమైతే, పశ్చిమబెంగాల్, గోవా, కర్ణాటకలో అప్పుడే చేతలలో చూపిస్తున్నారు. బిజెపి వైఖరిలో వచ్చిన ఈ పెనుమార్పును గమనించిన శివసేన (బిజెపి మిత్రపక్షం) ‘మున్ముందు అన్ని రాష్ట్రాలలో ఇవే పరిస్థితులు నెలకొనవచ్చని’ సామ్నా పత్రిక ద్వారా హెచ్చరించింది. మరి బిజెపి ధాటిని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో సహా అన్ని రాష్ట్రాలు ఎంతవరకు తట్టుకొని నిలబడతాయో చూడాలి.


Related Post