అప్పుడు జగన్‌... ఇప్పుడు బాబు!

July 11, 2019


img

ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో! ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నన్నాళ్లు టిడిపి శాసనసభ్యులు, చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి శాసనసభలో వ్యంగ్యంగా మాట్లాడుతుండేవారు. అప్పుడు జగన్‌ ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడికి ప్రయత్నించేవారు. శాసనసభలో టిడిపి సభ్యులతో వేగలేక, జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను నిరవదికంగా బహిష్కరించి పాదయాత్రలు చేసుకున్నారు. ఆ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగసభలలో కూడా జగన్‌ ఎప్పుడూ చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తుండేవారు. కనుక ఎప్పుడు చూసినా జగన్‌ మొహంలో కోపం, ఆవేశమే కనిపిస్తుండేది. 

ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్‌ సిఎం అయినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఎప్పుడూ చిర్నవ్వుతో కనిపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు సిఎం జగన్‌, ఆయన ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ ఎప్పుడూ ఆగ్రహంగా, ఆవేశంగా కనిపిస్తున్నారు. ఈరోజు శాసనసభ సమావేశంలో కూడా సేమ్ టూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.  జగన్‌ చిర్నవ్వుతో టిడిపి ఎమ్మెల్యేల వాదనలను తిప్పికొడుతూ, మద్యలో చంద్రబాబునాయుడును దెప్పిపొడుస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

“తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే చంద్రబాబునాయుడు గాడిదలు కాశారా?” అని జగన్ అన్నప్పుడు చంద్రబాబునాయుడు ఆగ్రహంగా ఊగిపోతే, జగన్‌ మూసిముసినవ్వులు నవ్వుతూ ‘మాట్లాడితే నా అనుభవమంత లేదు నీ వయసు అంటుంటారు కనీసం తెలుగు సామెతలు కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా?” అంటూ మళ్ళీ దెప్పి పొడిచారు.  చంద్రబాబునాయుడు కోపంతో ఊగిపోతుంటే జగన్‌ ఆ సన్నివేశాన్ని చాలా ఆనందించారు. అధికారంలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో, కోల్పోతే ఎలా ఉంటాయో ఈరోజు జరిగిన ఏపీ శాసనసభ సమావేశం కళ్ళకు కట్టినట్లు చూపించింది.


Related Post