కర్ణాటక సంక్షోభంపై ప్రముఖుల అభిప్రాయాలు

July 11, 2019


img

కర్ణాటకలో  రాజకీయ సంక్షోభం వెనుక బిజెపి హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. తిరుగుబాటు చేసిన కాంగ్రెస్‌, జెడిఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకరు ఆమోదిస్తే బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక దీనిలో అంతిమంగా రాజకీయ లబ్ది చేకూరేది బిజెపికే కనుక అదే తెర వెనుక ఉండి ఇదంతా నడిపిస్తోందని అందరూ బిజెపినే వేలెత్తి చూపుతున్నారు. 

సరిగ్గా ఇదే సమయంలో గోవాలో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమను బిజెపిలో విలీనం చేసుకోవాలని కోరుతూ గోవా అస్సెంబ్లీ స్పీకరుకు లేఖ ఇవ్వడంతో బిజెపి ఒక పద్దతి ప్రకారం అన్ని రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్షలను నిర్వీర్యం చేస్తూ బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అయ్యింది. 

తుదిశ్వాస విడిచేవరకు బిజెపిలో కొనసాగిన మాజీ రక్షణమంత్రి, దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర పారిక్కర్ తనయుడు ఉత్పల్ పారిక్కర్ బిజెపి తీరును ఏవగించుకుంటూ, “ఒకప్పుడు మా నాన్నగారున్నప్పటి బిజెపికి, ఇప్పటి బిజెపికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు బిజెపి విశ్వాసం, నిబద్దత సిద్దాంతాలుగా నడిచేది. కానీ ఇప్పుడు అధికారయావతో ఎంతకైనా తెగిస్తోంది. నా మనసులో మాటను చెప్పవలసిన సమయామిదేనని భావించి బయటపెడుతున్నాను,” అని అన్నారు. 

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ, “కర్ణాటక రాజకీయ సంక్షోభం వెనుక బిజెపి హస్తం ఉందని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌, జెడిఎస్ ఎమ్మెల్యేలను నయాన్నో భయాన్నో లొంగదీసుకొని వారి చేత రాజీనామాలు చేయించి, ముంబైకి తరలించి అక్కడ ఒక హోటల్లో వారిని నిర్బందించింది. ప్రజాస్వామ్యానికి,  రాజ్యాంగానికి ఏమాత్రం విలువనీయకుండా బిజెపి వ్యవహరిస్తోంది. కనీసం మీడియా ప్రతినిధులు కూడా వారిని కలవనీయకుండా కట్టడి చేస్తోంది.... ఎందుకు? అధికారం కోసం బిజెపి మరీ ఇంతగా దిగజారిపోవాలా?” అని ప్రశ్నించారు. 

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లను కూడా ఏదో ఒకరోజు తప్పక కిందకు దించుతామని రెండు రాష్ట్రాలలో బిజెపి నేతలు చెపుతున్న మాటలు మారిన బిజెపి వైఖరికి, దాని అధికార కాంక్షకు అద్దం పడుతున్నాయి. ఇటువంటి అనైతిక వ్యూహాలతో రాజకీయ సంక్షోభాలు సృష్టించి బిజెపి అధికారం చేజిక్కించుకోగలదేమో కానీ ప్రజలలో దాని ప్రతిష్ట ఎంతగా మసకబారిపోతోందో గ్రహించడం లేదు. ఇటువంటి పనుల వలన బిజెపి తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందగలదేమో కానీ దీర్ఘకాలంలో నష్టపోయే అవకాశం ఉంటుంది.


Related Post