అందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి: జగన్

July 11, 2019


img

నేటి నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి సభ్యుల మద్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దానిలో కలుగజేసుకొని ఇంకా ఆసక్తికరమైన సమాధానం చెప్పడం విశేషం. 

గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా జగన్‌మోహన్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మూడు రోజులు దీక్ష చేశారని, కానీ మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చారని, ప్రతిపక్షంలో ఉంటే ఒకవిధంగా, అధికారంలో ఉంటే మరోవిధంగా వ్యవహరించారని టిడిపి ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. 

సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దానికి సమాధానం చెపుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు మీరేమి చేశారు...గాడిదలు కాశారా?అప్పుడు అభ్యంతరం చెప్పనివాళ్ళు ఇప్పుడు నేను వెళితే దానిపై రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. అయినా నేను ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు అక్కడికి వెళ్ళాను?ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత వెళ్ళాను. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా వారు బటన్ నొక్కి దానిని ప్రారంభించకమానరు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత మనం చేయగలిగిందేమీ ఉండదు. కనుక రెండు రాష్ట్రాల మద్య సత్సంబందాలు నెలకొల్పాలనే ఉద్దేశ్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యాను. 

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనస్ఫూర్తిగా మాట్లాడుకొనే వాతావరణం ఉన్నప్పుడే ఏ సమస్యలనైనా పరిష్కరించుకోగలము. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకున్నప్పుడే వేగంగా అభివృద్ధి చెందగలవు.

చంద్రబాబునాయుడు డిల్లీలో చక్రం తిప్పుతున్నప్పుడే ఎగువన ఉన్న కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నప్పుడు ఏమీ చేయలేకపోయారు.ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచినప్పటి నుంచి కృష్ణా నదిలో వచ్చే నీరు 50 శాతం తగ్గిపోయింది.  

నిజానికి ఎగువ రాష్ట్రాలలో వారు నీటిని నిలువచేసుకోవడానికి డ్యాములు కట్టుకున్నా లేదా కాళేశ్వరం ప్రాజెక్టువంటివి నిర్మించుకొని తమకు అవసరమైన నీటిని తరలించుకుపోయినా దిగువ రాష్ట్రాలు చేయగలిగిందేమీ లేదు. మహా అయితే కోర్టులలో కేసులు వేయగలము. కేంద్రానికి మొరపెట్టుకోగలము. ట్రిబ్యూనల్స్ లో వాదోపవాదాలు చేయగలము తప్ప వాటి వలన ఏ ప్రయోజనం ఉండదని చరిత్ర చెపుతోంది. 

ఈ పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరే దిక్కు. మహారాష్ట్రలో నాసిక్ నుంచి వస్తున్న గోదావరి నదిలో కూడా నీరు అంతగా ఉండటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పారే ప్రాణిహిత నుంచి 36 శాతం, ఇంద్రావతి నుంచి 26 శాతం, మన రాష్ట్రంలో పారే శబరినదీ నుంచి కేవలం 11 శాతం కలిస్తేనే గోదావరిలో 73 శాతం నీరు ఉంటుంది. అంటే తెలంగాణ నుంచి గోదావరిలో కలిసే 62 శాతం నీటిలో సిఎం కేసీఆర్‌ మనకు వాటా పంచి ఇస్తానని చెపుతున్నారు.

మన రాష్ట్ర నీటి అవసరాలను గుర్తించిన తెలంగాణ సిఎం కేసీఆర్‌గారు ఎంతో ఔదార్యంగా గోదావరి నీటిని మన శ్రీశైలం, నాగార్జున ప్రాజెక్టులకు తరలించడానికి తనంతట తానే ముందుకు వచ్చారు. తద్వారా వారి రాష్ట్రంతో పాటు మన రాయలసీమ జిల్లాలకు నీరు అందించవచ్చు....కృష్ణా ఆయకట్టును స్థిరీకరించవచ్చునని ఆయన ఆలోచన చేయడం ఎంతో గొప్ప విషయం. మనతో ఇంత ఔదార్యంగా వ్యవహరిస్తున్న  సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందిపోయి నేను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లడంపై రాజకీయాలు చేస్తారా?” అని చంద్రబాబునాయుడును నిలదీశారు.


Related Post